ఢాకా: బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ రౌఫ్ తాలూక్దార్(Abdur Rouf Talukder) రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులు ఇటీవల కేంద్ర బ్యాంక్‌కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. బంగ్లా బ్యాంక్ గవర్నర్ శుక్రవారం తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నది.
ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటున్నారు. అయితే ఘటన నేపథ్యంలో ఆందోళనకారులు ఢాకాలో ఉన్న బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అబ్దుల్ రౌఫ్ 2022 జూలైలో బంగ్లా బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో దేశంలో తీవ్ర కరెన్సీ పతనం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మార్కెట్ల వడ్డీ రేట్లలో సరళతరమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ బ్యాంకింగ్ రంగంలో రుణాల డిఫాల్ట్ కేసులు ఆ సమయంలోనే పెరిగినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
కరోనా మహమ్మారి తర్వాత బంగ్లాదేశ్ ఆర్థికంగా కోలుకోలేకపోయింది. కర్ఫ్యూలు, ఇంటర్నెట్ బ్లాకౌట్స్ వల్ల తీవ్ర వత్తిడికి లోనైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి గత ఏడాది 4.7 బిలియన్ల రుణాన్ని తీసుకున్నది.