INDW vs BANW : వన్డే వరల్డ్ ఛాంపియన్‌గా స్వదేశంలో తొలి సిరీస్ ఆడాలనుకున్న భారత మహిళల జట్టుకు షాక్. సొంతగడ్డపై డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వైట్‌బాల్ సిరీస్ (White Ball Series) వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం టీమిండియాతో బంగ్లా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ, మాజీ ప్రధాని హేక్ హసీనా (Sheik Hasina)కు ఉరి శిక్ష విధించడంపై ఢాకాలో నిప్పురాజుకుంది. ప్రస్తుతం ఆ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భారత పర్యటనకు తమ మహిళల జట్టును పంపేందుకు ఆ దేశ బోర్డు సిద్ధంగా లేదని తెలుస్తోంది.
తొలిసారి విశ్వవిజేతగా అవతరించిన భారత జట్టు అదే ఉత్సాహంతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయాలనుకుంది. సిరీస్కోసం టీమిండియా క్రికెటర్లు సిద్ధమవుతున్నారు కూడా. కానీ, ఇంతలోనే పరిస్థితులు మారిపోయాయి. నిరుడు విద్యార్థి నిరసనలను అణచివేసే క్రమంలో 1,400 మంది మృతికి కారణమైన మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ కోర్టు మరణ శిక్ష విధించింది. అంతేకాదు భారత్‌లో తలదాచుకున్న హసీనాను తమకు అప్పగించాలని మోడీ ప్రభుత్వాన్ని కోరింది బంగ్లాదేశ్ గవర్నమెంట్.
🚨 REPORTS 🚨
India’s tour of Bangladesh in December has been postponed due to political tensions between the two countries. ❌
(Source – ESPN Cricinfo)#Cricket #ODI #T20I #BANvIND pic.twitter.com/BuQWV5wdFT
— Sportskeeda (@Sportskeeda) November 18, 2025
దాంతో.. ఆ దేశంలో మరోసారి నిరసనలు పెల్లుబికాయి. ఆ నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఈ రాజకీయ అల్లర్ల కారణంగానే బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటన వాయిదా పడింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి సమాచారమిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్‌ను మార్చడమే మంచిదని బీసీసీఐకి సూచించింది.
ఈ ఏడాది భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్ పర్యటన కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17-31 మధ్య ఆ దేశంలో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సింది. కానీ, ఇరుదేశాల క్రికెట్ షెడ్యూల్, ఇతర కమిట్మెంట్స్ కారణంగా పర్యటన వాయిదా వేసేందుకు ఇరు బోర్డులు అంగీకరించాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది.
ద్వైపాక్షిక సిరీస్‌లపై, అంతర్జాతీయ టోర్నీలపై ఆతిథ్య దేశాల్లోని అభద్రతా పరిస్థితులు ప్రభావం చూపడం చూశాం. నిరుడు స్వదేశంలో అల్లర్ల కారణంగా మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను సైతం బంగ్లా వదులుకుంది. అప్పుడు నిరసనకారులను చంపేయాలని ఆదేశించిన హసీనాపై ఇప్పుడు అంతర్జాతీయ శిక్షా ట్రిబ్యునల్ కోర్టు మరణ శిక్ష విధించింది. దాంతో.. ఆమె మద్దతుదారులు రాజధాని ఢాకాలో విధ్వంసం సృష్టిస్తున్నారు. అధ్యక్షుడు మొహమ్మద్ యూనిస్ రాజకీయ కక్షతోనే హసీనాకు ఉరి శిక్ష పడేలా చేశారని మండిపడుతున్నారు అవామీ లీగ్ పార్టీ సభ్యులు. ఫలితంగా.. ఐసీసీ భవిష్యత్ పర్యటనల కార్యక్రమంలో భాగంగా డిసెంబర్లో భారత్‌కు రావాల్సిన బంగ్లాదేశ్ మహిళల జట్టు ఆలస్యంగా రానుంది.