‘రికార్డులనేవి ఉన్నది బ్రేక్ చేయడానికే’.. పాకిస్థాన్‌తో రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టుకు ముందు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో బంగ్లాదేశ్ సారథి నజ్ముల్ హోసెన్ శాంతో చెప్పిన మాటలవి! కట్ చేస్తే సరిగ్గా ఐదు రోజుల తర్వాత అతడి మాటలే నిజమయ్యాయి. ఈ టెస్టుకు ముందు పాకిస్థాన్‌తో ఆడిన 13 టెస్టులకు గాను 12 మ్యాచ్‌లలోనూ బంగ్లాకు పరాభవమే. కానీ రావల్పిండిలో పర్యాటక జట్టు అద్భుతమే చేసింది. ఐదో రోజు ఆటలో క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో అనిశ్చితికి మారుపేరైన పాక్‌ను బోల్తా కొట్టించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. నాలుగు రోజులూ బ్యాటర్లకు అనుకూలించిన రావల్పిండి పిచ్ ఐదో రోజు అనూహ్యంగా ‘మలుపు’తీసుకోవడంతో మ్యాచ్ పాక్ చేతుల నుంచి చేజారింది.
Bangladesh | రావల్పిండి: పాకిస్థాన్ పర్యటనలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. గడిచిన రెండు నెలలుగా దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడి ‘అధికార మార్పు’ ఆందోళనలతో అతలాకుతలమైన అక్కడి ప్రజలకు కాస్త స్వాంతన చేకూర్చుతూ ఆ దేశ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై చారిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టును 10 వికెట్ల తేడాతో గెలుచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ తమ ఎదుట ఉంచిన 117 పరుగుల ఆధిక్యాన్ని తగ్గించి పర్యాటక జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించే క్రమంలో షాన్ మసూద్ సారథ్యంలోని పాక్.. 55.5 ఓవర్లలో 146 పరుగులకే చేతులెత్తేసింది.
బంగ్లా స్పిన్ ద్వయం మెహిది హసన్ మిరాజ్ (4/21), షకిబ్ అల్ హసన్ (3/44) స్పిన్ మాయాజాలానికి పాక్ స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అనంతరం పాక్ నిర్దేశించిన 30 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా పూర్తిచేసి ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. బంగ్లా తరఫున తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసిన ముష్ఫీకర్ రహీమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. 23 ఏండ్లుగా పాక్‌తో టెస్టులు ఆడుతున్న బంగ్లాకు ఇదే తొలి విజయం.
23/1. ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు పాక్ స్కోరు అది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 94 పరుగులు వెనుకబడ్డ పాక్ అనూహ్యంగా తడబడింది. కెప్టెన్ మసూద్ (14)ను రెండో ఓవర్‌కే హసన్ మహ్మద్ ఔట్ చేసి పాక్ పతనానికి దారులు వేశాడు. డ్రింక్స్ విరామం తర్వాత నహిద్ రాణా బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ (22), ఆ మరుసటి ఓవర్లోనే షకిబ్ బౌలింగ్‌లో సౌద్ షకీల్ (0) స్టంపౌట్ అవడంతో పాక్ కష్టాలు రెట్టింపయ్యాయి. అదే ఊపులో షకిబ్.. షఫీక్ (37)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక లంచ్‌కు రెండు ఓవర్ల ముందు మిరాజ్.. అఘా సల్మాన్ (0)నూ ఔట్ చేయడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
లంచ్ తర్వాత మిరాజ్.. షహీన్ అఫ్రిది (2)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నసీమ్ షా (3)ను షకిబ్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (51) ఆ జట్టు వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నాడు. కానీ మిరాజ్ మరోసారి మాయ చేసి అతడిని క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆ జట్టు ఆశలు అడుగంటాయి. ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జకీర్ హసన్ (15 నాటౌట్), ఇస్లాం (9 నాటౌట్) తడబాటు లేకుండా లాంఛనాన్ని పూర్తిచేశారు.
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 448/6 డిక్లేర్ (రిజ్వాన్ 171, షకీల్ 141), బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 565 ఆలౌట్ (ముష్ఫీకర్ 191, మిరాజ్ 77)
పాక్ రెండో ఇన్నింగ్స్: 146 ఆలౌట్ (రిజ్వాన్ 51, మిరాజ్ 4/21, షకిబ్ 3/44) బంగ్లా రెండో ఇన్నింగ్స్ : 30/0 (జకీర్ 15 నాటౌట్)
1 పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు (14 మ్యాచ్‌లలో) విజయం.
1 పాక్‌ను స్వదేశం (టెస్టుల)లో 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టు బంగ్లా.