Zimbabwe | సిల్హెట్ : బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న జింబాబ్వే.. ఆతిథ్య జట్టుకు అనూహ్య షాకిచ్చింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా సిల్హెట్ వేదికగా బుధవారం ముగిసిన తొలి టెస్టులో జింబాబ్వే.. 3 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదుచేసింది. రెండో ఇన్నింగ్స్లో బంగ్లా నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించిన జింబాబ్వేకు 2021 తర్వాత టెస్టులలో ఇదే తొలి గెలుపు. ఛేదనలో ఓపెనర్లు బెన్నెట్ (54), బెన్ కరన్ (44) తొలి వికెట్కు 95 పరుగులు జోడించి ఆ జట్టు విజయానికి బలమైన పునాది వేశారు.
అయితే మెహిది హసన్ మిరాజ్ స్పిన్ మాయ (5/50)తో జింబాబ్వే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ వెస్లీ (19 నాటౌట్), రిచర్డ్ ఎంగర్వ (4 నాటౌట్) మరో వికెట్ పడకుండా పర్యాటక జట్టు విజయాన్ని ఖాయం చేశారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 191 పరుగులకు ఆలౌట్ అవగా జింబాబ్వే 273 రన్స్ చేసింది. బదులుగా బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో 255 రన్స్ చేసి జింబాబ్వే ఎదుట 174 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఈ మ్యాచ్లో 9 వికెట్లు తీసిన జింబాబ్వే బౌలర్ ముజర్బనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.