BAN vs NED: వన్డే ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్లకు షాకిస్తుందని భావించిన బంగ్లాదేశ్ తనకంటే తక్కువ స్థాయి జట్లపై కూడా గెలిచేందుకు నానా తంటాలు పడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టును 229 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లా పులులు.. స్వల్ప ఛేదనలో 18 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో బంగ్లా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే..
ఛేదించాల్సిన లక్ష్యం స్వల్పంగానే ఉన్నా బంగ్లాదేశ్ మాత్రం దారుణంగా తడబడుతోంది. ప్రమాదకర ఓపెనర్ లిటన్ దాస్ (3)తో పాటు తాంజిద్ హసన్ (15) లు ఆరు ఓవర్ల లోపే పెవిలియన్ చేరారు. వన్ డౌన్లో వచ్చిన మెహిది హసన్ మిరాజ్ (40 బంతుల్లో 35, 5 ఫోర్లు, 1 సిక్సర్) కాస్త ఫర్వాలేదనిపించినా మిగిలినవాళ్లు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లారు. నజ్ముల్ హోసేన్ శాంతో (9), షకిబ్ అల్ హసన్ (5) తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ (1) కూడా విఫలమయ్యారు.
డచ్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటికే నాలుగు ఓవర్లు వేసిన 17 పరుగులిచ్చిన అతడు.. మూడు కీలక వికెట్లు తీసి బంగ్లా వెన్నువిరిచాడు. 18 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా.. 6 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం మహ్మదుల్లా, మెహిది హసన్ లు క్రీజులో ఉన్నారు.