షా ఆలమ్ (మలేషియా): ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పటిష్ఠ చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బుధవారం మహిళల విభాగంలో భారత్ 3-2తో చైనాపై అద్భుత విజయం సాధించింది. గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమైన స్టార్ షట్లర్ పీవీ సింధు తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. టాప్‌సీడ్ చైనాపై గెలుపు ద్వారా గ్రూపు-డబ్ల్యూ నుంచి భారత్ నాకౌట్‌కు అర్హత సాధించింది.
మరోవైపు పురుషుల టీమ్ ఈ టోర్నీలో 4-1తో హాంకాంగ్‌పై గెలిచి నాకౌట్లో నిలిచింది. ఇదిలా ఉంటే గత అక్టోబర్ నుంచి టోర్నీలకు దూరంగా ఉన్న సింధు సింగిల్స్ పోరులో 21-17, 21-15తో హాన్ యుపై గెలిచింది. నలభై నిమిషాల పాటు సాగిన పోరులో సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది. డబుల్స్‌లో భారత ద్వయం తనీషా క్యాస్ట్రో, అశ్విని పొనప్ప 19-21, 16-21తో లియు షెంగ్, టాన్నింగ్ జోడీ చేతిలో ఓడింది.
మరో సింగిల్స్‌లో అశ్మిత 13-21, 15-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాంగ్ జీపై ఓటమిపాలైంది. దీంతో భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన డబుల్స్ పోరులో త్రిసా జాలీ, గాయత్రీ గోపీచంద్ జోడీ 10-21, 21-18, 21-17తో జింగ్, ల్యు జు మిన్ జంటపై గెలిచి భారత విజయంలో కీలకమయ్యారు. చివరగా జరిగిన పోరులో అన్మోల్ 22-20, 14-21, 21-18తో వు లుయో యును ఓడించి జట్టు విజయంలో కీలకమయ్యాడు.