ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మళ్లీ ఆ జట్టును నడిపించబోతున్నాడు. మూడేండ్ల క్రితం సారథ్య పగ్గాలు కోల్పోయిన బాబర్.. తన స్థానంలో నియమితుడైన షాన్ మసూద్ చేతి నుంచే మళ్లీ టెస్టు కెప్టెన్సీని దక్కించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా రాబోయే వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనలకు జట్టును ప్రకటించగా మసూద్‌ను తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోమారు బాబర్‌నే నాయకుడిగా నియమించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ సిరీస్‌ను 0-2తో ఓడిన నేపథ్యంలో మసూద్‌పై వేటు తప్పలేదు. అతడి నాయకత్వంలో పాక్.. 16 టెస్టులాడితే 12 ఓడింది. ఇక రానున్న విండీస్, ఇంగ్లండ్ టూర్లకు పీసీబీ.. స్టార్ పేసర్లు షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, నోమన్ అలీలను పక్కనబెట్టింది.