లోవా(అమెరికా): భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సత్తాచాటాడు. వరుస టోర్నీల్లో సీనియర్లు విఫలమవుతున్న వేళ తానున్నానంటూ టైటిల్‌తో మెరిశాడు. యూఎస్ ఓపెన్ సూపర్-300 టోర్నీలో ఆయుష్ విజేతగా నిలిచి ఔరా అనిపించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ పైనల్లో ఆయుష్.. 21-18, 21-13 తేడాతో బ్రియాన్ యాంగ్(కెనడా)పై అలవోక విజయం సాధించాడు. 47 నిమిషాల్లో ముగిసిన పోరులో ఆయుష్ తనదైన ఆధిపత్యం ప్రదర్శించాడు. తద్వారా కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
2023 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన ఈ 20 ఏండ్ల యువ షట్లర్ ఈ సీజన్లో భారత టైటిల్ కరువుకు తెరదించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ తుదిపోరులో పోరాడి ఓడిన తన్విశర్మ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తన్వి.. 11-21, 21-16, 10-21తో టాప్‌సీడ్ బివాన్ జాంగ్(అమెరికా) చేతిలో ఓడింది. 46 నిమిషాల్లోనే ముగిసిన పోరులో 16 ఏండ్ల తన్వి.. అద్భుత పోరాటపటిమ కనబరిచింది. ఆడుతున్నది తొలి వరల్డ్ టూర్ ఫైనల్ అయినా ఎక్కడా వెనుకకు తగ్గకుండా తన్వి ఆకట్టుకుంది.