హైదరాబాద్, ఫిబ్రవరి2(నమస్తే తెలంగాణ): వ్యాయామ విద్యపై నేటి తరం పిల్లలకు సరైన అవగాహన లేదని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణలో ఉన్న 250 మంది ఆల్ఇండియా సివిల్ సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీరింగ్ అధికారులను ఉద్దేశించి గోపీచంద్ మాట్లాడాడు. ‘ప్రజలకు ముఖ్యంగా ఈ తరం పిల్లలకు వ్యాయామ విద్యపై అవగాహన కల్పించాల్సిన అసవరముంది. ఈ కాలం పిల్లలకు సరైన వ్యాయామం లేకపోవడంతో వాళ్లు తండ్రులు, తాతల కంటే చాలా బలహీనంగా ఉంటున్నారు. ఇందుకోసం వారికి ఆటలపై ఆసక్తి కలిగించాలి. క్రీడల ద్వారా పిల్లలు శారీరకంగా దృఢంగా ఉంటారు, మంచి అలవాట్లు వస్తాయి. పతకాలు సాధించడం కంటే అందరూ శారీరకంగా మెరుగ్గా ఉండేందుకు చైతన్యవంతం చేసేందుకు ఉద్యమంలా కార్యచరణ ప్రారంభించాలి’ అని అన్నాడు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ హర్‌ప్రీత్‌సింగ్, కోర్స్ డైరెక్టర్ దివ్యపర్మార్, ఎస్కార్ట్ ఆఫీసర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.