గుమి(దక్షిణ కొరియా) : ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలుగు యువ అథ్లెట్ జ్యోతి యర్రాజీ, అవినాశ్ సాబ్లెతో పాటు మహిళల 4X400 మీటర్ల రిలే టీమ్‌లో భారత్ స్వర్ణ పతకాలతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ రేసును జ్యోతి 12.96 సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ట్రాక్‌పై చిరుతను తలపిస్తూ జ్యోతి అగ్రస్థానంలో నిలిచింది. యుమి తనకా(జపాన్), వు యన్ని(చైనా) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
పురుషుల 3000మీటర్ల స్టిపుల్చేజ్లో స్టార్ స్ప్రింటర్ అవినాశ్ ము కుంద్ సాబ్లె 8:20:92సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం దక్కించుకున్నాడు. మహిళల 4X400 మీటర్ల రిలే రేసులో జిస్నా మాథ్యూస్, రూపాల్ చౌదరి, కుంజ రజిత, శుభా వెంకటేశన్‌తో కూడిన భారత జట్టు రేసును 3:34:18 సెకన్లలో పూర్తి చేసి పసిడి కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు 10వ స్వర్ణం కాగా, లీగ్‌లో ఇప్పటి వరకు భారత్‌కు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో దూసుకెళుతున్నది.