Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ పోటీల ఆరంభానికి ముందే కరోనా (Corona) కలకలం రేపింది. ఆస్ట్రేలియాకు చెందిన వాటర్ పోలో(Water Polo) క్రీడాకారిణికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో, అప్రమత్తమైన అధికారులు సదరు ప్లేయర్‌ను ఐసోలేషన్‌లో ఉంచారు. ఆమెతో పాటు కలిసి ఉన్న వాళ్లకు కూడా నిర్వాహకులు కొవిడ్ టెస్టు చేశారు. అయితే.. కొవిడ్ వచ్చింది ఎవరికి? అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు.
‘వాటర్ పోలో జట్టులోని ఇద్దరికీ కరోనా పరీక్షలు జరిపాం. వాళ్లలో ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సదరు అథ్లెట్‌ను ఐసోలేషన్‌లో ఉంచాం. ఇది టోక్యో కాదు. అందుకని కంగారు పడాల్సిన పనిలేదు. ఆమె రోజూవారీగానే ట్రైనింగ్ తీసుకుంటోంది. కాకపోతే ప్రత్యేక గదిలో ఉంటోంది. అయితే.. ఆమెకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం. మా వైద్యబృందం క్లియరెన్స్ ఇచ్చాకే ఆమెను పోటీలకు అనుమతిస్తాం’ అని ఆస్ట్రేలియా ఒలింపిక్స్ టీమ్ చీఫ్ అన్నా మేర్స్ వెల్లడించింది.

కరోనా కలకలం నేపథ్యంలో ఒలింపిక్ విలేజ్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఆటగాళ్లు, సిబ్బందికి ఏమాత్రం జలుబు, అస్వస్థత వంటి లక్షణాలు ఉన్నా వెంటనే కొవిడ్ పరీక్షలు జరిపేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 26వ తేదీన పారిస్ వేదికగా ఒలింపిక్స్ షురూ కానుంది. ఈసారి 460 మందితో కూడిన ఆస్ట్రేలియా బృందం విశ్వ క్రీడల్లో పాల్గొంటోంది.