కెర్న్స్(ఆస్ట్రేలియా): దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 పోరులో ఆసీస్ 2 వికెట్ల తేడాతో సఫారీలపై ఉత్కంఠ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. చివరి రెండు బంతుల్లో విజయానికి నాలుగు పరుగులు అవసరమైన దశలో ఎంగ్డీ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేస్తూ మ్యాక్స్‌వెల్..ఆసీస్‌కు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.
సహచరులు విఫలమైన వేళ తాను ఉన్నానంటూ ఇన్నింగ్స్ భారాన్ని మోస్తూ మ్యాక్స్‌వెల్(36 బంతుల్లో 62 నాటౌట్, 8ఫోర్లు, 2సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ మిచెల్ మార్ష్(54) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కార్బిన్ బాచ్(3/26), రబాడ(2/32), మఫాకా(2/36) ధాటికి ఆసీస్ ఒక దశలో 122 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 172/7 స్కోరు చేసింది.