Team India | బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో కీలమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా, భారత్ ఆసక్తికర పోరును వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. మూడో రోజు సోమవారం పలుమార్లు వర్షం అంతరాయం కల్గించడంతో పూర్తి ఆట సాధ్యపడలేదు. వర్షాభావ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఆస్ట్రేలియా..భారత్‌పై ఒత్తిడి అంతకంతకు పెంచేందుకు ప్రయత్నించింది. పలుమార్ల అంతరాయం తర్వాత ఆట ముగిసే సరికి టీమ్ఇండియా 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(33 నాటౌట్), కెప్టెన్ రోహిత్‌శర్మ(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్(4), గిల్(1), కోహ్లీ(3), పంత్(9) ఘోరంగా విఫలమయ్యారు.
స్టార్క్(2/25) రెండు వికెట్లతో రాణించగా, కమిన్స్(1/7), హాజిల్‌వుడ్(1/17) ఒక్కో వికెట్ తీశారు. చేతిలో 6 వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 394 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది. ఈ మ్యాచ్‌లో కనీసం 246 పరుగులు చేస్తే తప్పా..భారత్ ఫాలోఆన్ తప్పించుకోలేదు. అంతకుముందు ఓవర్‌నైట్‌స్కోరు 405/7తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 445 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(70) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. బుమ్రా(6/76) ఆరు వికెట్లతో విజృంభించగా, సిరాజ్‌కు రెండు ఆకాశ్‌దీప్, నితీశ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఈ సిరీస్‌లో ఆరు వికెట్ల ప్రదర్శన కనబర్చడం బుమ్రాకు ఇది రెండోసారి. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
గబ్బా పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు పోరాట పటిమ కనబర్చిన చోట భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ పేస్ త్రయం స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్ పదునైన పేస్ ధాటికి టీమ్ఇండియా 44 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. స్టార్క్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి జైస్వాల్..మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో స్టార్క్ ఔట్‌సైడ్ ఆఫ్‌సైడ్ బంతిని ఆడిన గిల్..మార్ష్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లీ మరోమారు ఉసూరుమనిపించాడు. హాజిల్‌వుడ్ ఊరించే బంతిని డ్రైవ్ ఆడబోయిన కోహ్లీ.. కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. పలుమార్లు వర్షం అంతరాయంతో ఏకాగ్రత దెబ్బతిన్న పంత్..కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతోఇంతో రాహుల్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్(హెడ్ 152, స్మిత్ 101, బుమ్రా 6/76, సిరాజ్ 2/97),
భారత్ తొలి ఇన్నింగ్స్: 51/4(రాహుల్ 33 నాటౌట్, పంత్ 9, స్టార్క్ 2/25, కమిన్స్ 1/7)