Australia Cricket : నవంబర్‌లో టీమిండియాతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా (Australia) తొలి ప్రాధాన్యం ఇస్తోంది. రెండుసార్లు ఓటమితో సరిపెట్టుకున్న ఆసీస్ జట్టు ఇప్పుడు విజయంతో మురవాలని పట్టుదలతో ఉంది. అందుకనే పాకిస్థాన్‌తో పొట్టి సిరీస్ కోసం టెస్టు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. సోమవారం ఆస్ట్రేలియా సెలెక్టర్లు ప్రకటించిన 13 మందితో కూడిన బృందంలో పలువురు స్టార్ క్రికెటర్లు లేరు. విచిత్రం ఏంటంటే.. పాకిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కంగారూ సారథి ఎవరు? అనేది ఇంకా తేలలేదు. త్వరలోనే 13 మందిలో ఒకరిని కెప్టెన్‌గా ప్రకటించే అవకాశముంది.
బోర్డర్ గవాస్కర్ సిరీస్ నేపథ్యంలో పాక్‌తో పొట్టి సిరీస్‌కు ఆసీస్ సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంనిచ్చారు. టీ20 సిరీస్‌లో పొరపాటున గాయపడితే భారత జట్టుతో సిరీస్‌కు కష్టమనే భావనతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్లు మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్‌లతో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్లను పక్కన పెట్టేశారు.
Introducing our Men’s T20I squad to take on @TheRealPCB next month 🇦🇺 🇵🇰 pic.twitter.com/5TdEF3EqMd
— Cricket Australia (@CricketAus) October 28, 2024
అయితే.. మ్యాక్స్‌వెల్, ఆడం జంపా వంటి టీ20 స్పెషలిస్ట్‌లను జట్టులోకి తీసుకున్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున దంచికొట్టిన యువకెరటం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు.ఆసీస్, పాక్‌ల మధ్య నవంబర్ 16న సిడ్నీ మైదానంలో తొలి టీ20, అనంతరం 18వ తేదీన ఓవల్‌లో రెండో టీ20 జరుగనున్నాయి.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్, అరోన్ హర్డీ గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, సియాన్ అబాట్, గ్జావియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నొలి, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడం జంపా.