Bangladesh Test Captaincy : తనదైన రోజున నీళ్లలో ముసలి మాదిరిగా ఎంతటి పెద్ద జట్టునైనా వణికించే బంగ్లాదేశ్ (Bangladesh) ప్రస్తుతం కెప్టెన్సీ సమస్య ఎదుర్కొంటోంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం ‘మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నేను ఉండలేను’ అంటూ నజ్ముల్ హుసేన్ శాంటో (Najmul Hussain Shanto) స్పష్టం చేశాడు. దాంతో, అతడి వారసుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ వీడ్కోలు పలకడంతో.. క్రికెటర్లలో ఒకరిని సారథిగా ప్రకటించే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్సీపై స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (Taijul Islam) ఆసక్తి చూపిస్తున్నాడు. శాంటో పగ్గాలు వదిలేస్తే.. నేనున్నాగా అంటూ సెలెక్టర్లకు ఈ స్పిన్నర్ చెప్పాడు. ‘శాంటో టెస్టు కెప్టెన్‌గా తప్పుకుంటాడనే విషయం నా చెవిన పడలేదు. నిజం చెబుతున్నా అతడు సుదీర్ఘ ఫార్మాట్ పగ్గాలు వదిలేస్తాడని నాకు ఎవరూ చెప్పలేదు. నేను 10 ఏండ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నా. టెస్టు కెప్టెన్సీ చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.
క్రికెట్ అనేది బృందంగా ఆట. ముఖ్యమైన విషయం ఏంటంటే.. జట్టు ఎల్లప్పుడు మంచి స్థితిలో ఉండాలి. అయితే.. బయట జరిగే సంఘటనల వల్ల కొందరు ఆటగాళ్లు ప్రభావితం అవుతుంటారు. మరికొందరు మాత్రం అవేమీ పట్టనట్టు మౌనంగా తమ పని తాము చూసుకుంటారు.
తైజుల్ ఇస్లాం
నా విషయానికొస్తే.. రిలాక్స్‌గా ఉండాలనుకుంటా. నా పనేంటో దానిపై శ్రద్ధ పెడుతా. కానీ, టీమ్‌లో ఎవరు ఏం అనుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరి ఆలోచన తీరు విభిన్నంగా ఉంటుంది. మేము బోర్డు సమావేశాల్లో పాల్గొనం కదా’ అని తైజుల్ తెలిపాడు. శాంటో తర్వాతి కెప్టెన్ అనిపించుకునేందుకు తైజుల్ ఉత్సాహంగా ఉన్నా బోర్డు మాత్రం ఇంకా స్పందించలేదు. ఒకవేళ శాంటో ఎవరి పేరైనా చెబుతాడా అని సెలెక్టర్లు, బోర్డు సభ్యులు వేచి చూస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
నెల క్రితం పాకిస్థాన్‌పై 2-0తో టెస్టు సిరీస్ గెలుపొంది చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌కు భారత పర్యటన పెద్ద షాక్. వరుసగా రెండు మ్యాచుల్లో.. ఆపై టీ20ల్లోనూ ఘోర పరాజయం ఎదురైంది. సొంతగడ్డపై విజయంతో ఆ బాధను మర్చిపోవాలనుకున్నా బంగ్లా ఆటగాళ్ల ఆశ నెరవేరలేదు.
మిర్పూర్లో జరిగిన తొలి టెస్టు మర్క్రమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 12 ఏండ్ల తర్వాత ఆసియా గడ్డపై మొదటి టెస్టు గెలిచింది. సిరీస్‌లో కీలమైన రెండో టెస్టు అక్టోబర్ 29న ఛత్రోగ్రామ్ వేదికగా మొదలవ్వనుంది. అందువల్ల సఫారీలతో టెస్టు సిరీస్ ముగిశాక నయా కెప్టెన్‌పై బంగ్లా క్రికెట్ బోర్డు ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం.