మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి. హ్యాట్రిక్ టైటిల్ వేటలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక.. టైటిల్ పోరులో అమెరికాకు చెందిన 19వ సీడ్ మాడిసన్ కీస్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. టైటిల్ ఫేవరేట్లలో ఒకరిగా నిలిచి టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్‌కు సెమీస్‌లో అనూహ్య షాక్ తగిలింది. కీస్‌తో హోరాహోరీగా జరిగిన పోరులో రెండో సీడ్ స్వియాటెక్.. 7-5, 1-6, 6-7 (8/10)తో పరాజయం పాలైంది. టోర్నీలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీస్‌కు చేరిన ఈ పోలండ్ భామకు కీస్ ఊహించని షాకులిచ్చింది. తొలి సెట్ మొదటి గేమ్ గెలుచుకున్న కీస్ కొద్దితేడాతో ఆ సెట్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత బలంగా పుంజుకుంది. రెండో సెట్లో స్వియాటెక్ ఆటలు సాగలేదు.
ఇద్దరు తలా ఓ సెట్ నెగ్గడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో సెట్‌కు దారితీసింది. చివరి సెట్లో ఈ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా పోరాడి మ్యాచ్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లారు. ఇక టైబ్రేక్‌లో ఒకరికి మించి ఒకరు ఆధిపత్యం చెలాయిస్తూ ఒక్కో పాయింట్‌ను కూడగట్టుకుని విజయం దిశగా సాగారు. అయితే 8వ పాయింట్ తర్వాత వరుసగా రెండు పాయింట్లు దక్కించుకున్న కీస్.. ఏడేండ్ల సుదీర్ఘ విరామం (2017లో యూఎస్ ఓపెన్ ఫైనల్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి. మ్యాచ్‌లో కీస్ 7 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టింది. ఏడు డబుల్ ఫాల్ట్స్ చేసిన స్వియాటెక్.. 40 అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్ గెలవాలన్న తన కలను మరో ఏడాదికి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
మరో మ్యాచ్‌లో ఒకటో సీడ్ సబలెంక..6-4, 6-2తో బడోస (స్పెయిన్)ను ఓడించి ఈ టోర్నీలో వరుసగా మూడో సారి ఫైనల్ చేరింది. మొదటి సెట్లో వరుసగా రెండు గేమ్స్ గెలుచుకున్న బడోస ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయింది. ఆరంభంలో తడబడ్డా మ్యాచ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్న సబలెంక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. కాగా ఫైనల్లో గెలిచి సబలెంక హ్యాట్రిక్ సాధిస్తే.. మార్టినా హింగిస్ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను 1997-99 తర్వాత వరుసగా మూడు సార్లు గెలిచిన తొలి మహిళా ప్లేయర్‌గా నిలుస్తుంది.