Mitchell Starc | సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 35 ఏండ్ల ఈ పేసర్.. టెస్టులు, వన్డేలలో కెరీర్‌ను కొనసాగించేందుకు గాను టీ20ల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. మరో ఆరు నెలల్లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు స్టార్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పొట్టి ఫార్మాట్లో 2012లో అరంగేట్రం చేసి ఆసీస్ తరఫున 65 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్.. 7.74 ఎకానమీతో 79 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫార్మాట్లో అతడు ఆస్ట్రేలియా నుంచి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ (జంపా 103 మ్యాచ్‌లలో 130 వికెట్లతో మొదటి స్థానం) గా ఉన్నాడు.
నవంబర్‌లో ఇంగ్లండ్‌తో మొదలుకాబోయే యాషెస్ సిరీస్, భారత్‌తో టెస్టు సిరీస్‌లకు తోడు 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతున్న స్టార్క్.. టీ20ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘టెస్టులే నా మొదటి ప్రాధాన్యత. టీ20లలో నేను ఆడిన ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. ముఖ్యంగా 2021 టీ20 వరల్డ్ కప్. ఆ టోర్నీలో టైటిల్ గెలవడం కంటే గ్రూపుగా మేం చాలా ఎంజాయ్ చేశాం’ అని స్టార్క్ చెప్పాడు. ఈ ఫార్మాట్లో స్టార్క్ చివరిసారిగా 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఆడాడు. సుదీర్ఘ కెరీర్లో స్టార్క్ ఐదు టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు.
అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌తో పాటు ఆ తర్వాత భారత్‌తో ఆడాల్సి ఉన్న సిరీస్‌కు ఆసీస్ వన్డే సారథి పాట్ కమిన్స్ దూరమయ్యాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ విషయాన్ని నిర్ధారించింది. వెన్నునొప్పి కారణంగా అతడు రెండు సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. రాబోయే యాషెస్ సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకే కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఏ వర్గాలు తెలిపాయి.