ప్రపంచంలో ఏ పిచ్‌పై అయినా పరుగుల వరద పారించగల సామర్థ్యం ఉన్న బ్యాటర్లు.. బంతిని అందుకుంటే పిచ్‌తో సంబంధం లేకుండా రాకెట్ వేగానికి తోడు బాల్‌ను రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టే బౌలర్లు.. మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆల్‌రౌండర్లు.. సొంతగడ్డపై అనుకూల పరిస్థితులు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గత రెండుసార్లు ఎదురైన సిరీస్ ఓటములకు బదులు తీర్చుకోవాలన్న పట్టుదల.. వెరసి భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా పూర్తిస్థాయి అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతోంది.
Border -Gavaskar Trophy | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లియాన్.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేర్లివి. మరో మూడు రోజుల్లో మొదలుకాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్.. ఆస్ట్రేలియా గడ్డపై ముచ్చటగా మూడోసారి సొంతం చేసుకోవాలన్నా.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మూడోసారి ఆడాలన్నా పైన పేర్కొన్న ఆటగాళ్ల దూకుడుకు అడ్డుకట్టవేయడం అత్యంత ఆవశ్యకం. బ్యాటర్లతో పాటు బౌలర్లలో ఏ ఒక్కరు కుదురుకున్నా మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. గత రెండు సిరీస్‌లలో వీరి జోరుకు కళ్లెం వేసినా ప్రస్తుతం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఈ గెలుపు గుర్రాలను ఆపడం అంత సులభమేమీ కాదు.
భారత్‌తో మ్యాచ్ అంటేనే చెలరేగి ఆడే బ్యాటర్లలో స్మిత్, హెడ్, లబూషేన్ అత్యంత కీలకం. వీళ్లు క్రీజులో కుదురుకుంటే ఓ పట్టాన పెవిలియన్‌కు చేరరు. సీనియర్ బ్యాటర్ స్మిత్ టీమ్ఇండియా అంటేనే చెలరేగిపోతాడు. మనతో ఆడిన 19 టెస్టులలో అతడు ఏకంగా 65.87 సగటుతో 2,042 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, 5 అర్ధ శతకాలున్నాయి. స్వదేశంలో భారత్‌పై 16 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 83.23 సగటుతో 1,082 పరుగులు చేశాడంటేనే అతడి జోరును అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ ఖవాజాకు భారత్‌పై ఘనమైన రికార్డేమీ లేకపోయినా ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో అతడు జోరుమీదున్నాడు. గత 12 టెస్టులలో అతడు 943 పరుగులు (41 సగటు) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ రిటైర్ అయిన తర్వాత అతడు సరైన ఓపెనింగ్ భాగస్వామి లేక ఇబ్బందిపడుతున్నా గతేడాది భారత పర్యటనలో బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్న అనుభవం అతడికుంది.
టెస్ట్ స్పెషలిస్టు లబూషేన్ గత పర్యటనలో టాప్ స్కోరర్ (426 పరుగులు). భారత్‌పై ఆడిన 10 మ్యాచ్‌లలో అతడు 45.58 సగటుతో 775 రన్స్ చేశాడు. అతడూ ప్రమాదకారే. ఇక రోహిత్ సేనకు రెండు ఐసీసీ ట్రోఫీలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ మిడిలార్డర్లో అత్యంత కీలకం. వన్డే వరల్డ్‌కప్, డబ్ల్యూటీసీ ఫైనల్- 2023లో అతడు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వికెట్ కీపర్ బ్యాటర్ క్యారీ సైతం అదే కోవకు చెందుతాడు. గత 20 ఇన్నింగ్స్‌లలో అతడు 536 పరుగులు చేసి ఆసీస్ విజయాల్లో కీలకంగా మారుతున్నాడు.
తుది జట్టులో చోటు దక్కించుకుంటే మిచెల్ మార్ష్ మ్యాచ్ గమనాన్నే మార్చేయగల సమర్థుడు. రికార్డులపరంగా వీళ్లంతా దుర్బేధ్యంగా కనిపిస్తున్నప్పటికీ గత కొంతకాలంగా వీరిలో ఖవాజా, మార్ష్ మాత్రమే టెస్టులలో 40 సగటు కలిగిఉన్నారు. 2023-25 సైకిల్లో 12 మ్యాచ్‌లు ఆడిన స్మిత్.. 35 సగటుతో 738 పరుగులు చేయగా.. లబూషేన్ 12 టెస్టులలో 29.68 సగటుతో 653 రన్స్ మాత్రమే సాధించాడు. గత డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఆడిన 12 టెస్టులలో హెడ్ సగటు 29.68 మాత్రమే.
బంతి పిచ్‌ను తాకడమే ఆలస్యం రాకెట్ వేగంతో దూసుకొచ్చే ఆసీస్ పిచ్‌లపై పేస్ త్రయం స్టార్క్, హెజిల్వుడ్, కమిన్స్‌ను కట్టడిచేయడం భారత బ్యాటర్లకు కత్తిమీద సవాలే. ఈసారి పక్కా ప్రణాళికతో దిగుతున్న ఈ త్రయానికి తోడు స్పిన్నర్ నాథన్ లియన్ కూడా టీమ్ఇండియాను ముప్పుతిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. గత పర్యటనలో ప్రస్తుత ఆసీస్ సారథి కమిన్స్.. 4 టెస్టులలోనే 21 వికెట్లతో చెలరేగితే హెజిల్వుడ్.. 17 వికెట్లు తీశాడు. భారత్‌తో ఆడిన 18 టెస్టులలో స్టార్క్ 48 వికెట్లు పడగొట్టగా కమిన్స్ 13 టెస్టులలోనే 50 వికెట్లు తీశాడు.
హెజిల్వుడ్ సైతం 15 టెస్టులలోనే 51 వికెట్లు తీశాడు. ఇక స్పిన్నర్ నాథన్ లియన్ అయితే 27 టెస్టులలో 121 వికెట్లు దక్కించుకున్నాడు. ఈసారి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న కంగారూలు.. ప్రత్యేకంగా పేస్ పిచ్‌లనే రూపొందించుకుంటున్న తరుణంలో వీరిని భారత బ్యాటర్లు ఏ మేరకు నిలువరిస్తారనేది కీలకం. పిచ్‌మీద పచ్చిక ఉంటే భారత బ్యాటర్లకు కాలరాత్రులు తప్పకపోవచ్చు.