Australia | గబ్బా (బ్రిస్బేన్): ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య ప్రఖ్యాత గబ్బా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఆసీస్ సిరీస్లో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు.. 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేశారు. గ్లెన్ మ్యాక్స్వెల్ (19 బంతుల్లో 43, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టోయినిస్ (7 బంతుల్లో 21 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. అనంతరం ఛేదనలో ఆసీస్ పేసర్ల ధాటికి పాక్ బ్యాటర్లు విలవిల్లాడారు.
తొలి ఆరుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకపోవడంతో ఆ జట్టు 7 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 64 పరుగులకే పరిమితమైంది. అబ్బాస్ అఫ్రిది (20 నాటౌట్) టాప్ స్కోరర్. ఎల్లీస్ (3/9), జేవియర్ (3/13), జంపా (2/11) మెరిశారు.