కామన్వెల్త్ క్రీడలలో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీలలో ఆస్ట్రేలియా మహిళా జట్టు సెమీస్‌కు చేరింది. ఇప్పటికే భారత్‌తో ఉత్కంఠగా ముగిసిన తొలి పోరులో గెలిచిన ఆసీస్.. బార్బడోస్నూ చిత్తుగా ఓడించింది. ఆదివారం బార్బడోస్ తో జరిగిన గ్రూప్-ఏ ఆరో మ్యాచ్‌లో ఆ జట్టు.. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ స్పిన్‌తో పాటు మెక్‌గ్రాత్, గార్డ్నర్లు బార్బడోస్‌ను బెంబేలెత్తించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆసీస్ జట్టు.. బార్బడోస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే బార్బడోస్ జట్టులో కెప్టెన్ హేలీ మాథ్యూస్ (18) మినహా మిగిలినవారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఓపెనర్ డాటిన్ (8), వికెట్ కీపర్ బ్యాటర్ కిసియా నైట్ (9), అలియా అలెన్ (8)లతో పాటు మిగిలినవారూ దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా బార్బడోస్ 20 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. కింగ్ 4 వికెట్లతో చెలరేగగా మెక్‌గ్రాత్ 3, ఆష్లే గార్డ్నర్ రెండు వికెట్లు పడగొట్టింది.
స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్.. 8.1 ఓవర్లలోనే ఛేదించింది. వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హీలి (23 నాటౌట్), మెగ్ లానింగ్ (31 నాటౌట్) లు ఆసీస్ విజయాన్ని త్వరగానే పూర్తి చేశారు. తాజా విజయంతో ఆసీస్.. వరుసగా రెండు విజయాలతో పాటు ఇప్పటికే గ్రూప్-ఏలో (నాలుగు పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి, నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండటంతో సెమీస్‌కు అర్హత సాధించినట్టైంది.
ఇదే గ్రూప్‌లో భారత్, బార్బడోస్ (ఒక విజయం, ఒక ఓటమి.. రెండు పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. పాకిస్తాన్ (2 పరాజయాలు) నాలుగో స్థానంలో ఉంది. ఇండియా తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా ఈనెల 3న బార్బడోస్ తో పోటీ పడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన వాళ్లు సెమీస్‌కు అర్హత సాధిస్తారు.