WTC Final : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైన్ల్ (WTC Final) కు సమయం దగ్గరపడింది. రేపు లార్డ్స్ మైదానంలో మెగా ఫైట్ షురూ కానుండగా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు టెస్టు గద (Test Mace)కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ బిగ్ ఫైట్‌లో గెలిచి ఛాంపియన్‌గా నిలవాలని సఫారీలు అనుకుంటుండగా.. ఐసీసీ ఫైనల్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటేందుకు ఆసీస్ సిద్దమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరుజట్లు ఫైనల్లో ఆడబోయే 11 మంది పేర్లను ప్రకటించాయి.
లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రేపటి(జూన్ 11 బుధవారం)తో తెరలేవనుంది. సీజన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా, దక్షిణాలు టైటిల్ కోసం నువ్వానేనా అన్నట్టు తలపడనున్నాయి. ఇక.. ఐసీసీ ఈవెంట్లలో చోకర్స్‌గా ముద్ర పడిన సఫారీలు ఈసారి టెస్టు గదను వదలొద్దనే కసితో ఉన్నారు. అందుకే.. బలమైన తుదిజట్టును ఎంపిక చేశారు కోచ్, కెప్టెన్.
🚨 WTC final update – South Africa announce their XI 🏏 pic.twitter.com/a3M5rRbPXN
— ESPNcricinfo (@ESPNcricinfo) June 10, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో చెలరేగి ఆడిన మర్క్రమ్, రికెల్టన్, స్టబ్స్‌లతో పాటు వెర్రినే, బడింగ్హమ్లు బ్యాటింగ్ భారం మోయనున్నారు. బౌలింగ్ యూనిట్ విషయానికొస్తే.. కగిసో రబడ, యాన్సెన్, కేశవ్ మహారాజ్‌తో పాటు సీనియర్ బౌలర్ అయిన లుంగి ఎంగిడి మూడో పేసర్‌గా జట్టులోకి వచ్చాడు.
దక్షిణాఫ్రికా తుది జట్టు : ఎడెన్ మర్క్రమ్, రియాన్ రికెల్టన్, వియాన్ మల్డర్, తెంబా బవుమా(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బడింగ్హమ్, కైలీ వెర్రినే(వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.
వరుసగా రెండోసారి ఫైనల్ చేరుకున్న ఆస్ట్రేలియా మరోసారి విజయంపై కన్నేసింది. నిరుడు ఛాంపియన్‌గా నిలిచిన జట్టలోని సగానికి పైగా ఆటగాళ్లు ఈసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఖవాజా, లబూషేన్, పేసర్ మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, లియాన్, హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీలు మరోసారి దేశానికి టెస్టు గదను అందించాలనే కసితో ఉన్నారు.
🚨 WTC final update – Marnus Labuschagne will open for Australia! pic.twitter.com/9DLJoa9GNM
— ESPNcricinfo (@ESPNcricinfo) June 10, 2025
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆడుతున్న ఆసీస్‌కు కమిన్స్ అతిపెద్ద బలం కానున్నాడు. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తుచేయగల సత్తా ప్యాటీ సొంతం. ఉస్మాన్ ఖవాజా, లబూషేన్, చిచ్చరపిడుగు ట్రావిస్ హెడ్, స్మిత్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీలతో కంగారూల బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన హేజిల్‌వుడ్.. తమకు లక్కీ హ్యాండ్ అవుతాడని కమిన్స్ బృందం భావిస్తోంది.
ఆస్ట్రేలియా తుది జట్టు : ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.