పెర్త్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలైన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌కు తొలిరోజే రసవత్తరమైన ఆరంభం! పేసర్లు నిప్పులు చెలరేగిన పెర్త్‌లో ఒకేరోజు 19 వికెట్లు నేలకూలాయి. ఇరుజట్ల బౌలర్లు ఒకరిని మించి ఒకరు ప్రత్యర్థి బ్యాటర్లను గజగజ వణికించడంతో తొలి రోజే రెండు ఇన్నింగ్స్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 32.5 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ (7/58) కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేశాడు. హ్యారీ బ్రూక్ (52) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్.. ఇంగ్లిష్ జట్టు కంటే దారుణంగా తడబాటుకు గురైంది.
ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అలెక్స్ కేరీ (26), గ్రీన్ (24) ఉన్నంతలో ఫర్వాలేదనిపించగా మిగిలినవారంతా క్రీజులో నిలబడేందుకు తంటాలు పడ్డారు. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ (5/23) ఫైఫర్‌తో రెచ్చిపోగా ఆర్చర్ (2/11), కార్స్ (2/45)తలా రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది.
కెరీర్ చరమాంకానికి చేరుతున్నా తన పేస్‌లో పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ ఆసీస్ తురుపుముక్క స్టార్క్ మరోసారి ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టిన అతడు.. కమిన్స్, హాజిల్‌వుడ్ లేని లోటును తెలియనీయకుండా చెలరేగాడు. తన తొలి ఓవర్లోనే జాక్ క్రాలీని డకౌట్ చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన స్టార్క్.. 4 ఫోర్లతో దూకుడుమీదున్న డకెట్‌ను ఏడో ఓవర్లో లెగ్ బిఫోర్‌గా వెనక్కి పంపాడు.
ఇక ఆస్ట్రేలియాలో చెత్త రికార్డు కల్గిన జో రూట్‌నూ డకౌట్ చేసి ఆ జట్టును కోలుకోనీయకుండా చేశాడు. ఈ క్రమంలో పోప్ (46), బ్రూక్ 11 ఓవర్ల పాటు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జతచేశారు. కానీ 20వ ఓవర్లో బంతినందుకున్న గ్రీన్.. పోప్‌ను వికెట్ల ముందు బలిగొన్నాడు. లంచ్ తర్వాత స్టార్క్ విజృంభణకు ఇంగ్లండ్ మిడిలార్డర్ కుదేలైంది. స్టోక్స్ (6)ను అద్భుతమైన డెలివరీతో బౌల్డ్ చేసిన అతడు.. లోయరార్డర్ పనిపట్టి ఆ జట్టు ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
పర్యాటక జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఆనందం ఆసీస్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు దక్కలేదు. అరంగేట్ర టెస్టు ఆడుతున్న ఓపెనర్ వెదరాల్డ్‌ను ఇన్నింగ్స్ రెండో బంతికే ఆర్చర్ డకౌట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. డిఫెన్స్‌ను ఆశ్రయించిన లబూషేన్ (9) సైతం ఆర్చర్ బంతిని వికెట్ల మీదకు ఆడుకోగా.. కార్స్ వరుస ఓవర్లలో స్మిత్ (17), ఖవాజా (2)ను పెవిలియన్‌కు పంపాడు. మూడో సెషన్లో డ్రింక్స్ విరామం తర్వాత బౌలింగ్‌కు వచ్చిన స్టోక్స్.. ఆసీస్ మిగిలిన 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ పైచేయి సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండు ఓవర్ల వ్యవధిలో ట్రావిస్ హెడ్ (21), గ్రీన్ (24)ను ఔట్ చేసి కంగారూలను కోలుకోలేని దెబ్బతీసిన స్టోక్స్.. కంగారూల తోకనూ కత్తిరించడంలో సఫలమయ్యాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 32.5 ఓవర్లలో 172 ఆలౌట్ (బ్రూక్ 52, పోప్ 46, స్టార్క్ 7/58, డొగెట్ 2/27);
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 39 ఓవర్లలో 123/9 (కేరీ 26, గ్రీన్ 24, స్టోక్స్ 5/23, ఆర్చర్ 2/11)