సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు (IND vs AUS) మూడో వన్డేలో అయినా గెలిచి ఓదార్పు విజయాన్నైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. పెర్త్‌లో వర్షం, వాతావరణం సహకరించక విఫలమైన టీమ్ఇండియా.. అడిలైడ్‌లో కాస్త మెరుగ్గా ఆడినా కీలక సమయాల్లో పట్టు విడిచి మూల్యం చెల్లించుకుంది. కానీ సిడ్నీలోని ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) వేదికగా శనివారం జరుగబోయే మూడో మ్యాచ్‌లో అయినా నెగ్గి సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించడం గిల్ సేనకు కత్తి మీద సవాలే. టాపార్డర్ బ్యాటింగ్ వైఫల్యం మెన్ ఇన్ బ్లూను వేధిస్తున్నది. భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్ (వన్డే)లలో ఇంతవరకూ క్లీన్‌స్వీప్ చేయని ఆసీస్ మాత్రం ఆ కలను ఇప్పుడు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఉన్న ఆసీస్.. తమకు అచ్చొచ్చిన సిడ్నీలోనూ అదరగొట్టాలనే లక్ష్యంతో ఉంది.
భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయి తీవ్ర నిరాశపరిచాడు. రోహిత్ తొలి వన్డేలో విఫలమైనా అడిలైడ్‌లో కుదురుకున్నాడు. ఈ జోడీకి ఇదే ఆఖరి ఆస్ట్రేలియా పర్యటన (రాబోయే రెండేండ్లలో ఆ జట్టుతో భారత్‌కు వన్డే సిరీస్‌లు లేవు) అని భావిస్తున్న నేపథ్యంలో ఈ ద్వయానికి కంగారూల గడ్డపై ఇదే చివరి అవకాశం. మరి సిడ్నీలో అయినా కోహ్లీ తన అభిమానుల ఆకలి తీరుస్తాడా? అన్నది ఆసక్తికరం. ఇక టాపార్డర్‌లో కెప్టెన్ గిల్ వైఫల్యం కూడా జట్టును నిరాశకు గురిచేస్తున్నది. గత రెండు వన్డేల్లోనూ అతడు విఫలమవడం జట్టు లయను దెబ్బతీసింది. బ్యాటింగ్ సమస్యలతో పాటు జట్టు కూర్పు విషయంలోనూ గత రెండు వన్డేల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో ఏమైనా మార్పులతో బరిలోకి దిగుతుందా? లేక అదే జట్టుతో ఆడుతుందా? అనేది చూడాలి. నితీశ్ కుమార్ వంటి ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నా అతడిని సరిగా వినియోగించుకోవడం లేదనేది మాజీల వాదన. సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో కుల్దీప్ను జట్టులోకి తీసుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక సిడ్నీలో భారత రికార్డు కూడా గొప్పగా ఏమీ లేదు. ఇక్కడ ఆసీస్‌తో ఆడిన 19 మ్యాచ్‌లలో భారత్ గెలిచినవి రెండే రెండు.
మొదటి రెండు వన్డేల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో ఉన్న మిచెల్ మార్ష్ సేన.. సిడ్నీలోనూ భారత్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తున్నది. కొత్త ఆటగాళ్లతో ఆడుతున్న ఆ జట్టుకు షార్ట్, ఓవెన్, కూపర్, రెన్షా రూపంలో నాణ్యమైన ఆటగాళ్లు లభించారు. రాబోయే యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌కు విశ్రాంతినిచ్చే అవకాశముంది.