లార్డ్స్: దక్షిణాఫ్రికాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా కీలక ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగినా బంతితో సఫారీల పనిపట్టిన కంగారూలు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 218 పరుగుల భారీ ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు బిగించారు. రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికాను 138 పరుగులకే కట్టడి చేసిన కమిన్స్ సేన.. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల విలువైన ఆధిక్యం దక్కించుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఆట ముగిసే సమయానికి 144/8 చేసింది. సఫారీ పేసర్లు లుంగి ఎంగిడి (3/35), కగిసొ రబాడా (3/44), వియాన్ మల్డర్ (1/14) ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ విలవిల్లాడినా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ (43), మిచెల్ స్టార్క్ (16*) నిలబడటంతో కంగారూలు 200+ లీడ్ సాధించారు.
అంతకుముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ (6/28) విజృంభణతో దక్షిణాఫ్రికా కుదేలైంది. తొలి రోజు మాదిరిగానే పచ్చిక పిచ్‌పై ఇరు జట్ల పేసర్ల ధాటికి బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. రెండో రోజు 13 వికెట్లు నేలకూలగా అవన్నీ పేసర్లకే దక్కాయి. కాగా పేసర్లకు అనుకూలిస్తున్న లార్డ్స్ పిచ్‌పై సఫారీలకు లక్ష్య ఛేదన అంత సులువేం కాదు. మూడో రోజు ఆట తొలి సెషన్లో ఆసీస్ తోకను కత్తిరించి.. ఛేదనలో వికెట్లను కాపాడుకుంటేనే ఆ జట్టు బతికి బట్ట కట్టే అవకాశాలుంటాయి.
ఓవర్ నైట్ స్కోరు 43/4తో రెండో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలి సెషన్లో నిలకడగా ఆడింది. కెప్టెన్ టెంబ బవుమా, బెడింగ్హమ్ ఆసీస్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. స్టార్క్ 25వ ఓవర్లో బవుమా.. రెండు బౌండరీలు సాధించి సఫారీ స్కోరును 50 పరుగుల మార్కును దాటించాడు. కమిన్స్ వేసిన ఓవర్లో స్కేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్‌తో అలరించాడు. కానీ అతడే వేసిన 40వ ఓవర్లో ఆఫ్‌సైడ్ వేసిన బంతిని బవుమా కవర్స్ దిశగా డ్రైవ్ చేయబోయి.. లబూషేన్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో 64 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. బవుమా స్థానంలో వచ్చిన వెరీన్తో కలిసి బెడింగ్హమ్ సఫారీ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఫస్ట్ సెషన్లో సౌతాఫ్రికా 27 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది.
లంచ్ తర్వాత ఆసీస్ సారథి కమిన్స్ విజృంభణతో సఫారీ తొలి ఇన్నింగ్స్ కథ 8.1 ఓవర్లలోనే ముగిసింది. 49 ఓవర్లలో 121/5తో భోజన విరామానికి వెళ్లిన దక్షిణాఫ్రికా.. 12 పరుగుల వ్యవధితో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. లంచ్ తర్వాత కమిన్స్ ఒకే ఓవర్లో.. వెరీన్, మార్కో యాన్సెన్‌ను ఔట్ చేసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. మరో రెండు ఓవర్ల తర్వాత అతడే.. సఫారీలు భారీ ఆశలు పెట్టుకున్న బెడింగ్హమ్నూ ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. కేశవ్ మహారాజ్ (7) రనౌట్ అవగా రబాడా (1) వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో కంగారూలకు తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం దక్కింది.
తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆధిక్యం దక్కిన ఆనందం కంగారూలకు ఎంతోసేపు నిలువలేదు. సఫారీ పేస్ దళాన్ని తొలి 10 ఓవర్ల పాటు సమర్థవంతంగా ఎదుర్కున్న ఆసీస్.. ఆ తర్వాత పట్టు కోల్పోయింది. రబాడా గత ఇన్నింగ్స్‌లో మాదిరిగానే ఒకే (11వ) ఓవర్లో ఖవాజా (6), గ్రీన్ (0)ను ఔట్ చేసి ఆసీస్‌కు డబుల్ షాకులిచ్చాడు. టీ విరామం తర్వాత బంతినందుకున్న ఎంగిడి నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కంగారూ మిడిలార్డర్ పనిపట్టాడు. యాన్సెన్.. లబూషేన్ (22)ను వెనక్కిపంపగా స్మిత్ (13), వెబ్‌స్టర్ (7), కమిన్స్ (6) ఎంగిడి పేస్‌కు దాసోహమయ్యారు. 73 రన్స్‌కే 7 వికెట్లు నష్టపోయిన ఆసీస్‌ను అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ ఆదుకున్నారు. వీరిరువురూ ఆసీస్ ఆధిక్యాన్ని 200 పరుగులు దాటించడంతో పాటు ఆ జట్టును పటిష్టస్థితిలో నిలబెట్టారు. అయితే రబాడా.. క్యారీని ఔట్ చేసి 61 పరుగుల ఈ భాగస్వామ్యానికి తెరదించాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్ (బెడింగ్హ్మ్ 45, బవుమా 36, కమిన్స్ 6/28, స్టార్క్ 2/41); ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 40 ఓవర్లలో 144/8 (క్యారీ 43, లబూషేన్ 22, ఎంగిడి 3/35, రబాడా 3/44)