David Warner : అంతర్జాతీయ క్రికెట్లో పునరామనంపై ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు పెద్ద షాక్. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఆడాలనుకున్న అతడి కల ఫలించేలా లేదు. అవును.. చాంపియన్స్ ట్రోఫీ కోసం వార్నర్‌ను పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆసీస్ జాతీయ సెలెక్టర్ జార్జ్ బెయిలీ (Jeorge Bailey) తెలిపాడు. దాంతో, డేవిడ్ భాయ్ మళ్లీ పసుపు జెర్సీ వేసుకోవడం ఇక అసాధ్యమే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
‘వార్నర్ రిటైర్ అయ్యాడని మాకు తెలుసు. అయితే.. సుదీర్ఘ కెరీర్లో మూడు ఫార్మట్లలో ఎన్నో ఘనతలు సాధించిన అతడిని మేము అభినందిస్తున్నాం. ఆస్ట్రేలియా క్రికెట్‌కు వార్నర్ చేసిన సేవను కొనియాడుతున్నాం. కానీ, పాకిస్థాన్‌లో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీలో వార్నర్ ఉండడు. ఎందుకంటే.. జట్టులోకి కొత్త ఆటగాళ్లు వస్తున్నారు. ఇక గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్‌లు ఈ మెగా టోర్నీ ఎంతో కీలకం’ అని బెయిలీ వెల్లడించాడు.
ఈమధ్యే వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రిటైర్మెంట్ యూటర్న్ గురించి పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో తన పునరాగమనం గురించిన ఆలోచనలు అతడు పంచుకున్నాడు. ‘అధ్యాయం ముగిసింది. సుదీర్ఘ సమయం ఓపెనర్‌గా ఆడడం నిజంగా గొప్ప ఫీలింగ్. ఆస్ట్రేలియా నా జట్టు. నా కెరీర్ ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్‌లకే సరిపోయింది.
అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడాను. నా జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక కొన్నాళ్లు ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడుతా . ఒకవేళ సెలెక్టర్లు అవకాశమిస్తే వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కోసం యూటర్న్ తీసుకుంటా అని వార్నర్ రాసుకొచ్చాడు.
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు.. వరల్డ్ కప్ ట్రోఫీతో వన్డేలకు వీడ్కోలు పలికేసిన డేవిడ్ భాయ్.. టీ20 వరల్డ్ కప్‌తో అన్ని ఫార్మట్ల నుంచి వైదొలిగాడు. తన సుదీర్ఘ కెరీర్లో వార్నర్ పలు రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండర్ చరిత్ర సృష్టించాడు.
