బార్బడోస్: ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. గ్రూప్-బీలో భాగంగా బార్బడోస్ వేదికగా ఒమన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ స్టోయినిస్(36 బంతుల్లో 67 నాటౌట్, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాట్‌తో పాటు బంతి (3/19) తోనూ రాణించడంతో కంగారూలు 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. స్టోయినిస్, డేవిడ్ వార్నర్ (51 బంతుల్లో 56, 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఒమన్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో అయాన్ ఖాన్ (30 బంతుల్లో 36, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడాడు.
ప్రమాదకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ (12) వికెట్‌ను ఆసీస్ మూడో ఓవర్లోనే కోల్పోయింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (14) విఫలమవగా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యాడు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను వార్నర్, స్టోయినిస్ ఆదుకున్నారు. ఒమన్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో మధ్య ఓవర్లలో ఆసీస్ వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఓపెనర్‌గా దిగి 17 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా వార్నర్ దూకుడుగా ఆడలేకపోయాడు. కానీ మెహ్రాన్ ఖాన్ 15వ ఓవర్లో స్టోయినిస్ 4 భారీ సిక్సర్లతో ఆసీస్ స్కోరు వేగం పెరిగింది. మరుసటి ఓవర్లో సిక్సర్‌తో అతడు అర్ధ శతకాన్ని పూర్తిచేయగా షకీల్ 18వ ఓవర్లో సిక్స్‌తో వార్నర్ కూడా అర్ధసెంచరీ మార్క్ అందుకుని ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
ఛేదనలో ఒమన్ టాపార్డర్ విఫలమైంది. స్టార్క్ (2/20), ఎల్లిస్ (2/28), స్టోయినిస్ ధాటికి ఒమన్ కుదేలైంది. టాప్ -5 బ్యాటర్లలో కెప్టెన్ అఖిబ్ (18) ఒక్కడే కాస్త ప్రతిఘటించాడు. 57 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఒమన్‌ను అయాన్, మెహ్రాన్ ఖాన్ (27) ఆదుకోవడంతో ఆ జట్టు అవమానకర ఓటమిని తప్పించుకుంది. స్పిన్నర్ ఆడమ్ జంపా (2/24) ఒమన్‌ను కట్టడి చేశాడు.
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 164/5 (స్టోయినిస్ 67 నాటౌట్, వార్నర్ 56, మెహ్రాన్ ఖాన్ 2/38, కలీముల్లా 1/30).
ఒమన్: 20 ఓవర్లలో 125/9 (అయాన్ ఖాన్ 36, మెహ్రాన్ ఖాన్ 27, స్టోయినిస్ 3/19, స్టార్క్ 2/20)