AUS vs WI T20I: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో కరేబియన్ వీరులు కంగారూలకు కంగారు పుట్టించారు. హోబర్ట్ వేదికగా శుక్రవారం ముగిసిన మొదటి టీ20లో ఆసీస్ 213 పరుగుల భారీ స్కోరు చేసినా విజయం కోసం ఆఖరి బంతి వరకూ పోరాడాల్సి వచ్చింది. లక్ష్య ఛేదనలో విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. విజయానికి దగ్గరగా వచ్చినా ఆ జట్టు 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (36 బంతుల్లో 70, 12 ఫోర్లు, 1 సిక్సర్) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
హోబర్ట్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదల బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఇటీవలే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి స్వల్ప విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ ఆడుతున్న వార్నర్ దంచికొట్టాడు. మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (25 బంతుల్లో 39, 5 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించాడు. అయితే ఈ ఇద్దరి తర్వాత ఆసీస్ బ్యాటింగ్ లైనప్ తడబడింది. మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ (10) , స్టోయినిస్ (9)లు విఫలమయ్యారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 37, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మాథ్యూ వేడ్ (14 బంతుల్లో 21, 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి ఆసీస్‌కు భారీ స్కోరు సాధించిపెట్టారు.
ఛేదనలో విండీస్ కూడా దంచికొట్టింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (37 బంతుల్లో 53, 7 ఫోర్లు, 1 సిక్స్), జాన్సన్ చార్లెస్ (25 బంతుల్లో 42, 6 ఫోర్లు, 1 సిక్స్) లు తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 89 పరుగులు జోడించారు. అయితే ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా, స్టోయినిస్‌లు ఇచ్చిన షాకులతో విండీస్ కోలుకోలేకపోయింది. చార్లెస్, వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ (18)ను జంపా ఔట్ చేయగా బ్రాండన్ కింగ్, షై హోప్ (16)లను స్టోయినిస్ ఔట్ చేశాడు. కెప్టెన్ రొవ్మన్ పావెల్ (14) కూడా నిరాశపర్చగా ప్రమాదకర ఆండ్రీ రసెల్ (1)ను జంపా ఔట్ చేసి విండీస్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు.
Big player v big player.
Adam Zampa comes up trumps against Andre Russell.
Is that the match?#PlayOfTheDay | #AUSvWI pic.twitter.com/Xk1MozKuIf
— cricket.com.au (@cricketcomau) February 9, 2024
కానీ ఆఖర్లో జేసన్ హోల్డర్ (15 బంతుల్లో 34 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి ఆసీస్‌ను వణికించాడు. మరో రెండు మూడు బంతులు మిగిలుంటే హోల్డర్.. విండీస్‌కు విజయాన్ని అందించేవాడు అన్నట్టుగా అతడు ధాటిగా ఆడాడు. ఆసీస్ బౌలర్లలో జంపా (4 ఓవర్లలో 26 పరుగులిచ్చి మూడు వికెట్లు), స్టోయినిస్ (3 ఓవర్లలో 20 పరుగులు 2 వికెట్లు) పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టీ20 ఈనెల 11న జరగాల్సి ఉంది.