David Warner | ఆస్ట్రేలియా డేంజర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (124 బంతుల్లో 163; 14 ఫోర్లు, 9 సిక్సర్లు).. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో మరే ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో వార్నర్ మూడుసార్లు 150 పైచిలుకు స్కోర్లు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. డేవిడ్ భాయ్ ఒక్కడే ఈ ఫీట్ మూడుసార్లు నమోదు చేయగా.. మరే ప్లేయర్ కనీసం రెండు సార్లు కూడా 150 ప్లస్ స్కోర్లు చేయలేకపోయారు.
వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో పోరులో వార్నర్ ఈ రికార్డు తన పేరిట రాసుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. బర్త్‌డే బాయ్ మిషెల్ మార్ష్ (108 బంతుల్లో 121; 10 ఫోర్లు, 9 సిక్సర్లు)తో కలిసి వార్నర్ విధ్వంసకాండ రచించాడు. ఈ క్రమంలో తాజా మెగాటోర్నీలో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గానూ వార్నర్ రికార్డుల్లోకెక్కాడు. వీరిద్దరి జోరుతో ఆస్ట్రేలియా తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 259 పరుగులు జోడించింది.
సిక్సర్లు రికార్డు బద్దలు కొట్టిన ఓపెనర్లు
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరఫున అతి పెద్ద తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన వార్నర్, మార్ష్ సిక్సర్లలోనూ నయా మార్క్ నిర్దేశించారు. ఇప్పటి వరకు మెగాటోర్నీలో ఆస్ట్రేలియా తరఫున గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్ ఎనిమిదేసి సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిస్తే.. ఈ మ్యాచ్ ద్వారా మొదట మార్ష్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. కాసేపటికి వార్నర్ అతడి సరసన చేరాడు. వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సిక్సర్లు (19) కూడా ఇదే మ్యాచ్‌లో నమోదయ్యాయి.