బులవాయో: ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. పాకిస్థాన్ పేస్ బలం.. అండర్-19 వరల్డ్‌కప్(Under-19 World Cup) ఆసక్తికర పోరుకు తెరలేపింది. గ్రూపు 2లో కీలకమైన మ్యాచ్‌లో ఇవాళ రెండు దాయాది జట్లు తలపడనున్నాయి. అయితే టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. అండర్-19 మెగాటోర్నీలో ఓటమి ఎరుగని టీమ్ ఇండియా నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సూపర్-6 పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఓ మార్పు చేశారు. ఉదవ్ మోహన్ స్థానంలో దీపేశ్‌ను తీసుకున్నారు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము ముందు బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే పేర్కొన్నాడు. గ్రూపు 2లో ఇండియా మూడు మ్యాచ్‌లు నెగ్గి ఆరు పాయింట్లతో, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు నెగ్గి 4 పాయింట్లతో నిలిచాయి.
ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని యువ భారత్ కసిమీద ఉంది. లీగ్ దశలో బంగ్లాదేశ్, అమెరికా, న్యూజిలాండ్‌పై గెలిచిన భారత్..సూపర్-6 తొలి పోరులో జింబాబ్వేను చిత్తుచేసింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాక్‌పై గెలువడం ద్వారా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నాకౌట్‌కు అర్హత సాధించనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు, విహాన్ మల్హోత్రా మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసిరానుంది.