ఢిల్లీ: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఎక్కువ బెర్తులు దక్కించుకుని పారిస్ కంటే ఎక్కువ పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న భారత షూటర్లకు సదావకాశం. 2028 క్రీడల్లో 8 బెర్తులను ఖాయం చేసే ఆసియా రైఫిల్/పిస్టోల్ చాంపియన్‌షిప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. వచ్చే ఏడాది ఢిల్లీలో జరుగబోయే ఈ టోర్నీకి సంబంధించి తేదీలు ఖరారు కాకపోయినా బిడ్‌ను దక్కించుకున్నట్టు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కలికేశ్ సింగ్ దేవ్ తెలిపారు.
ఈ టోర్నీ కంటే ముందే భారత్.. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి 30 వరకు జరగాల్సి ఉన్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ రైఫిల్/పిస్టోల్/షాట్‌గన్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్నది. ఇది కూడా ఒలింపిక్స్‌కు క్వాలిఫికేషన్ (ఇందులో 12 బెర్తులున్నాయి) ఈవెంట్ కావడం విశేషం. స్థానికంగా ఉండే పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ మన షూటర్లు ఎలా రాణిస్తారో చూడాలి. పారిస్ ఒలింపిక్స్‌లో 22 మంది షూటర్లు భారత్ నుంచి పోటీలో ఉండగా లాస్ ఏంజెల్స్‌లో ఆ సంఖ్యను 24కు పెంచాలనే లక్ష్యంతో ఎన్ఆర్ఏఐ ప్రణాళికలు రూపొందిస్తున్నది.