షిమ్కెంట్(కజకిస్థాన్) : ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన బుధవారం జరిగిన పురుషుల స్కీట్ ఫైనల్లో భారత యువ షూటర్ అనంత్‌జీత్‌సింగ్ నరుక పసిడి పతకంతో మెరిశాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన తుదిపోరులో అనంత్‌జీత్ 57 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, మన్సూర్ అల్ష్రీది(కువైట్, 56), అలీ అహ్మద్ అల్ ఇషాక్(ఖతార్, 43) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఏషియన్ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. 10మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో భారత యువ జోడీ సౌరభ్ చౌదరీ, సురుచి ఇందర్‌సింగ్ కాంస్య పతకం సొంతం చేసుకుంది.
కాంస్య పతక పోరులో సౌరభ్, సురుచి ద్వయం 17-9తో కొరియాకు చెందిన లీయు హెంగ్, హెస్ సింగ్‌పై అద్భుత విజయం సాధించింది. ఇదే విభాగంలో చైనా 16-12తో దక్షిణకొరియాపై గెలిచి స్వర్ణం దక్కించుకుంది. అంతకుముందు జరిగిన అర్హత పోరులో సురుచి(292), సౌరభ్(286) ఐదో స్థానంతో ప్రధాన పోరులో నిలిచారు. ఈ సీజన్ షూటింగ్ ప్రపంచకప్ టోర్నీల్లో నాలుగు స్వర్ణాలు సాధించిన సురుచి ఇందర్‌సింగ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. మరోవైపు జూనియర్ 10మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్‌ఈవెంట్‌లో భారత ద్వయం వంశిక చౌదరి, గవిన్ ఆంథోనీ 16-14తో కొరియా జంట కిమ్ యెజిన్, కిమ్ డుయిన్పై గెలిచి కాంస్యం ఖాతాలో వేసుకున్నారు.