Asian Games | ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు. ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో లేఖను విడుదల చేశారు. పోటీల్లో భారత ఆటగాళ్లు పూర్తి శక్తితో ఆడతారని హామీ ఇచ్చారు. ఆటగాళ్లు దేశం కోసం ఆసియా క్రీడల్లో ఆడాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల భారత ఫుట్‌బాల్ జట్టు ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుందని, దీంతో క్రీడాకారుల్లో మనోధైర్యం పెరిగిందన్నారు.
తమ ఫుట్‌బాల్ జట్టును ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని.. జాతి గర్వం, త్రివర్ణ పతకాం కోసం పోరాడుతామని ప్రధాని, కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు ఎప్పుడూ పాల్గొంటుందని, జాతీయ జట్టుగా గత నాలుగేళ్లలో కష్టపడి కొన్ని చిరస్మరణీయ విజయాలు సాధించామన్నారు. అందరి సహకారంతో మరింత మెరుగ్గా రాణించగలమని నిరూపించామని, ఫ్రాన్స్‌లో మీరు చేసిన ప్రసంగం భారత ఫుట్‌బాల్ గురించి ఆలోచించే అభిమానులందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. ఫుట్‌బాల్ ప్రపంచం తరపున, తమ ఫుట్‌బాల్ జట్టును ఆసియా గేమ్స్‌లో పాల్గొనడానికి అనుమతించాలని కోరారు.