Asia Cup 2023 | వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకునేందుకు ఆసియా దేశాలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వరల్డ్‌కప్ జరుగనుండగా.. దానికంటే ముందు మెగాటోర్నీ సన్నాహకంగా నేటి నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ పాల్గొంటున్న ఈ టోర్నీలో దాయాదుల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. మరింకెందుకు ఆలస్యం వన్డే మజా ఆస్వాదించేందుకు మీరు కూడా సిద్ధమైపోండి!
కొలంబో: పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు టీమ్ఇండియాకు మరో పరీక్ష ఎదురుకానుంది. మన ఖండంలోనే ఆరు దేశాల మధ్య బుధవారం నుంచి ఆసియా కప్ ప్రారంభమవుతున్నది. హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి పోరుకు పాకిస్థాన్‌లోని ముల్తాన్ ఆతిథ్యమిస్తుండగా.. నేపాల్‌తో పాక్ అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక వేదిక కానుంది. అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుండగా.. దాని కంటే ముందే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాల్గొనని విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడుతున్న దాయాదుల మధ్య ఈ టోర్నీలో రసవత్తర పోటీ సాగనుంది. బలాబలాలను పరీక్షించుకునేందుకు ఈ టోర్నీని వినియోగించుకోవాలని అన్నీ జట్లు ఆశిస్తున్నాయి. వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ టోర్నీ ద్వారా కూర్పును పరీక్షించుకోవాలని టీమ్ఇండియా భావిస్తున్నది. ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు సార్లు ఆసియాకప్ కైవసం చేసుకున్న భారత్.. ఈ సారి కూడా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.
హైబ్రిడ్ పద్ధతిలో..
గత పదేండ్లుగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా నెగ్గని భారత్.. స్వదేశంలో జరుగనున్న ప్రపంచకప్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. దీంతో మెగాటోర్నీలో ఆడనున్న జట్టుపై ఒక అంచనాకు వచ్చేందుకు ఆసియాకప్ ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోకపోవడంతో.. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని హెడ్‌కోచ్ ద్రవిడ్ పేర్కొనగా.. మిడిలార్డర్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న దాయాది పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే వన్డే ప్రపంచకప్ జట్టు ఎంపిక చేయనున్న నేపథ్యంలో జట్టులో చోటు ఆశిస్తున్న ప్లేయర్లంతా సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ విషయాల్లో పాకిస్థాన్ జట్టు సమతూకంగా ఉండగా.. డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను గాయాల బెడద వెంటాడుతున్నది. షకీబ్ అల్ హసన్ సారథ్యంలో బంగ్లా బరిలోకి దిగనుండగా.. పెద్ద జట్లకు షాకిచ్చేందుకు అఫ్గాన్ సిద్ధంగా ఉంది.
పాకిస్థాన్ X నేపాల్
ముల్తాన్: ప్రతిష్ఠాత్మక ఆసియాకప్ ఆరంభ పోరులో బుధవారం నేపాల్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సత్తాచాటాలని పాకిస్థాన్ తహతహలాడుతుంటే.. నేపాల్ ఉనికి కోసం పోరాడనుంది.