Asia Cup | ఆసియా కప్‌లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. అయితే, మ్యాచ్‌లో క్యాచ్ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన పాక్ బోర్డు.. ఈ అంశంపై దర్యాప్తు చేయాలంటూ ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. గతంలో భారత్‌తో షేక్ హ్యాండ్ అంశంపై రచ్చ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పట్టుబట్టినా ఐసీసీ వెనక్కి తగ్గలేదు. తాజాగా మరోసారి క్యాచ్ అంశాన్ని వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..!
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ టీమిండియా పేసర్ హర్దిక్ పాండ్యా వేసిన బంతికి బ్యాట్‌కి తగిలి వెళ్లి వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేతిలో పడింది. ఫీల్డ్ కంపైర్ గాజీ సోహెల్ థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. అయితే, బంతి శాంసన్ గ్లోవ్స్‌లోకి వెళ్లేముందు నేలను తాకినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలుసార్లు రీప్లేలో పరిశీలించిన టీవీ అంపైర్ రుచిర పల్లియగురుగే క్యాచ్ నిర్ధారిస్తూ అవుట్‌గా ప్రకటించాడు. అయితే, బంతి నేలను తాకలేదని.. బంతి కింద శాంసన్ వేళ్లు ఉన్నట్లుగా రీప్లేలో కనిపించింది.
దాంతోనే టీవీ అంపైర్ అవుట్ ఇవ్వగా.. పాక్ బ్యాట్స్‌మెన్ ఫకర్ అసంతృప్తితోనే పెవిలియన్‌కు వెళ్లాడు. అయితే, ఫకర్ జమాన్ క్యాచ్ అవుట్‌పై కోచ్ మైక్ హెస్సన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా విలేకరులతో మాట్లాడుతూ.. బంతి శాంసన్ గ్లోవ్స్ చేరేలోపు బౌన్స్ అయ్యిందని.. అది క్యాచ్ కాదని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పీసీబీ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు లేఖ రాస్తూ ఈ ఎపిసోడ్‌పై ఫిర్యాదు చేసింది. ఫఖర్ జమాన్ అవుట్ అయిన విధానంపై ఐసీసీకి ఫిర్యాదు చేశామని.. అది అవుట్ కాదని.. ఈ విషయంపై దర్యాప్తు కోరుతున్నట్లుగా పీసీబీ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు.
భారత్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ తర్వాత పీసీబీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. టాస్ సమయంలో భారత కెప్టెన్‌తో కరచాలనం చేయొద్దని పాక్ కెప్టెన్ సల్మాన్‌కు సూచించినట్లుగా పాక్ బోర్డు ఆరోపించింది. దాంతో ఆయనను టోర్నీ నుంచి తొలగించాలని ఐసీసీకి రెండుసార్లు లేఖ రాసింది. 14న జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై విజయం అనంతరం.. పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత సాయుధ దళాలకు విజయాన్ని అంకితం చేస్తూ.. మృతులకు భారత జట్టు సంఘీభావంగా నిలుస్తుందన్నారు. షేక్ హ్యాండ్ వివాదంలో పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే తాము టోర్నీ నుంచి తప్పుకుంటామని ఐసీసీని హెచ్చరించింది. అయితే, పీసీసీ డిమాండ్‌ను ఐసీసీ అంగీకరించలేదు.
యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాక్ జట్టు డ్రామాకు తెరలేపింది. డిమాండ్‌కు ఐసీసీ వెనక్కి తగ్గకపోవడం చివరకు పాక్ దిగివచ్చి స్టేడియానికి చేరుకుంది. మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. అయితే, మ్యాచ్ రిఫరీ క్షమాపణలు చెప్పారని పాక్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. యూఏఈతో మ్యాచ్‌కు ముందు పైక్రాఫ్ట్ పాక్ కెప్టెన్, కోచ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలను పీసీబీ విడుదల చేసింది. పాకిస్తాన్ జట్టు ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పిఎంఓఎ) మార్గదర్శకాలను ఉల్లంఘించిందని, ఈ అత్యంత గోప్యమైన ప్రాంతంలో ఎవరూ వీడియో తీయడానికి అనుమతి లేదని ఐసీసీ స్పష్టం చేసింది. పాక్ విడుదల చేసిన వీడియోలు ఆడియో లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. సూపర్-4లో పాక్‌పై విజయం అనంతరం భారత జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పాక్ టీమ్ మేనేజ్మెంట్ మోహం చాటేసింది.