Asia Cup | ఆసియా కప్ ఈ నెల 30న ప్రారంభంకానున్నది. టోర్నీలో భారత్ సెప్టెంబర్ 2న పాక్‌తో తలపడనున్నది. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు మళ్లీ టీమిండియాలో చోటు దక్కింది. చాలా కాలం తర్వాత ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ఆడబోతున్నారు. అయితే, కేఎల్ రాహుల్ ఇప్పటికీ స్నాయువు గాయంతో బాధపడుతుండగా.. కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. కాగా, అయ్యర్, రాహుల్ పునరాగమనంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీమిండియాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏ ఆటగాడైనా తన ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు ఆసియా కప్ అత్యుత్తమ టోర్నీ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచకప్ చాలా దగ్గరలోనే ఉందని, అలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లందరికీ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించాలన్నారు. ‘అందరికీ ఇంకా అవకాశం రాలేదు. అతడు నేరుగా ప్రపంచకప్‌లో ఆడి మళ్లీ గాయపడితే ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా? దీనికి మొత్తం జట్టు మూల్యం చెల్లిస్తుంది’ అన్నారు. తక్కువ బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేసే అవకాశం ఉంటుందని.. ఇది వారికి రిథమ్‌ను తిరిగి పొందేందుకు, విశ్వాసాన్ని పెంపొందించడానికి అవకాశాన్ని ఇస్తుందన్నారు. ప్రపంచకప్‌లో ఎవరైనా ఆటగాడు గాయపడితే అది చాలా దారుణమని, గాయం నుంచి తిరిగి వచ్చిన ఆటగాళ్లకు ఆడే అవకాశం రావాలని, ఫిట్‌గా ఉంటే ప్రపంచకప్‌కు ఎంపి చేయాలన్నారు.
ఆసియా కప్ ఆగస్టు 30న మొదలుకానున్నది. హైబ్రిడ్ మోడల్లో జరిగే ఆసియా కప్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు పాక్‌లో, తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాక్‌తో ఆడనున్నది. భారత్‌తో కలిసి గ్రూప్-ఏలో పాక్, నేపాల్ ఉన్నాయి. కాగా, గ్రూప్-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ -4 దశకు చేరుకుంటాయి. ఇందులో రెండు జట్లు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.