ICC | పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఆసియా కప్ నుంచి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలన్న పీసీబీ డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం తిరస్కరించింది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కరచాలనం చేయవద్దని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పినట్లుగా పీసీబీ ఆరోపించింది. ఈ మేరకు పీసీబీ విజ్ఞప్తిని పరిశీలించిన ఐసీసీ.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని పాక్ బోర్డుకు వెల్లడించింది. పైక్రాఫ్ట్‌ను తొలగించేది లేదని పీసీబీకి ఐసీసీ వర్తమానం పంపంది. అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం యూఏఈతో జరిగే పాక్ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లోనూ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించనున్నారు.
సమాచారం మేరకు.. మ్యాచ్ తర్వాత ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేయబోరని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని పలువురు అధికారులతో పాటు పీసీబీ డైరెక్టర్‌కు కూడా తెలుసని పలు నివేదికలు తెలిపాయి. అయినప్పటికీ పీసీబీ, పీసీబీ చైర్మన్ ఈ వ్యవహారాన్ని పెద్దది చేసినట్లుగా ఆరోపణలున్నాయి. పీసీబీ భారత ఆటగాళ్లు, మ్యాచ్ రిఫరీపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు అధికారికంగా ఫిరా్యదు చేసింది. పైక్రాఫ్ట్ సూచనల మేరకు ఇద్దరు కెప్టెన్ల మధ్య షీట్ మార్పిడి జరుగలేదని పాక్ జట్టు మేనేజ్ నవేద్ చీమా ఆరోపించారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని.. సూర్యకుమార్ యాదవ్‌తో కరచాలనం చేయవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు పైక్రాఫ్ట్ సూచించాడని చీమా పేర్కొన్నారు. ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడానికి నిరాకరించి భారత ప్లేయర్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పీసీబీ ఆరోపించింది.
అయితే పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే యూఏఈతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ క్రమంలో రేపు యూఏఈతో మ్యాచ్ జరుగనున్నది. అయితే, పీసీబీ బెదిరింపులకు ఐసీసీ లొంగలేదు. ఇందులో పైక్రాఫ్ట్ పాత్ర ఏం లేదని ఐసీసీ భావించింది. ఈ విషయంలో ఏసీసీ కూడా సమాచారం ముందే తెలిసినట్లుగా తేలడంతో ఐసీసీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇక రేపు యూఏఈతో పాక్ మ్యాచ్ ఆడుతుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.