దుబాయ్ : ఆసియాకప్‌లో(Asia Cup 2025) షేక్‌హ్యాండ్ వివాదం పాకిస్థాన్, యూఏఈ మ్యాచ్‌పై పడింది. ఇవాళ ఆ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చివరి వరకు మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న ఉత్కంట నెలకొన్నది. అయితే మ్యాచ్‌ను గంట ఆలస్యం చేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. పీసీబీ ప్రతినిధి ఆమిర్ మిర్ లాహోర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, పీసీబీ చీఫ్ మోషిన్ నఖ్వీ, మాజీ చైర్మెన్ రమీజ్ రాజా, నజమ్ సేథీ దీనిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో ఉన్న పాక్ జట్టుతో లాహోర్ నుంచి ఆన్లైన్లో పీసీబీ చర్చలు నిర్వహిస్తున్నది.
ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్థాన్ ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నది. దుబాయ్‌లోని హోటల్ వద్ద టీమ్ బస్సులోకి పాక్ క్రికెటర్ల కిట్లను ఎక్కిస్తున్న విజువల్స్‌ను రిలీజ్ చేశారు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్న పీసీబీ.. ప్రస్తుతం యూఏఈతో మ్యాచ్‌ను గంట పాటు వాయిదా వేసినట్లు తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం హోటల్ లాబీల నుంచి జనాలను పంపించారు. క్రికెటర్లను వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం హోటల్ నుంచి టీం బస్సు.. స్టేడియానికి బయలుదేరి వెళ్లింది.
మ్యాచ్‌ను పూర్తిగా నిర్వహించనున్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొన్నది. స్థానిక కాలమానం రాత్రి ఏడు గంటలకు టాస్ వేయనున్నారు. 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది.