Asia Cup-2022 | ఆసియా కప్-2022 షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ సెక్రెటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఈ నెల 27న టోర్నీ ప్రారంభంకానున్నది. 28న దయాది జట్టు పాక్‌తో భారత జట్టు తలపడనున్నది. గ్రూప్-3లో మొత్తం మూడు జట్లు ఉండగా.. భారత్, పాక్‌తో పాటు క్వాలిఫికేషన్ రౌండ్లో గెలిచిన మరో జట్టు గ్రూప్‌లోకి చేరుకుంటుంది. గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అన్ని మ్యాచ్‌లు దుబాయి, షార్జాలో జరుగనున్నాయి. అయితే, ఆసియా కప్ ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు కొనసాగనుండగా.. ఈ సారి టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది.
1984లో ఈ టోర్నీ ప్రారంభంకాగా.. 2014 వరకు 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగింది. ఆ తర్వాత 2016లో టీ20 ప్రపంచ కప్ కారణంగా టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది యథావిధిగా వన్డే ఫార్మాట్లో జరుగనున్నది. ఇప్పటి వరకు ఆసియా కప్ 13 ఎడిషన్లలో భారత జట్టు పాల్గొనగా.. ఏడుసార్లు చాంపియన్‌గా నిలువగా.. మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక జట్టు ఉన్నది. శ్రీలంక ఇప్పటి వరకు ఐదుసార్లు చాంపియన్‌గా, ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచింది. పాక్ రెండుసార్లు టైటిల్ సాధించగా.. రెండుసార్లు రన్నర్‌గా నిలిచింది.