6- టెస్టులలో అశ్విన్ శతకాలు. చెన్నైలో రెండోది. 2021లో ఇంగ్లండ్‌పై ఇదే వేదికలో సెంచరీ చేశాడు.
చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు పోరు రసవత్తరంగా సాగుతున్నది. టాస్ గెలిచిన బంగ్లా ఊహించని రీతిలో భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయని హసన్..కెప్టెన్ రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌గిల్, విరాట్ కోహ్లీని ఔట్ చేసి ఆదిలోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. యశస్వి జైస్వాల్, పంత్ బ్యాటింగ్‌తో గాడిలో పడ్డ టీమ్ఇండియాను అశ్విన్, జడేజా ఒడ్డున పడేశారు. లోకల్ హీరో అశ్విన్..బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అజేయ సెంచరీతో చెలరేగితే జడేజా బ్యాటు ఝులిపించడంతో భారత్ 339 పరుగుల మార్క్ అందుకుంది. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ వీరిద్దరి బ్యాటింగ్‌తో పోరాడే స్కోరు అందుకుంది. శుక్రవారం ఇదే జోరు కొనసాగితే.. భారత్‌కు భారీ స్కోరు సాధ్యమైనట్లే.
చెన్నై: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ‘లోకల్ బాయ్’ రవిచంద్రన్ అశ్విన్ (112 బంతుల్లో 102 నాటౌట్, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక గర్జన చేసి భారత్‌ను ఆదుకున్నాడు. బంగ్లా యువ పేసర్ హసన్ మహ్ముద్ (4/58) ధాటికి కకావికలమైన భారత స్కోరు బోర్డును మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (117 బంతుల్లో 86 నాటౌట్, 10 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి పటిష్ట స్థితికి చేర్చాడు. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (6), శుభ్‌మన్ గిల్ (0), కేఎల్ రాహుల్ (16) దారుణంగా విఫలమైన చోట చెపాక్ పిచ్‌పై సంపూర్ణ అవగాహన కలిగిన భారత స్పిన్ ద్వయం.. అజేయమైన ఏడో వికెట్‌కు 195 పరుగులు జోడించింది. అశ్విన్, జడ్డూ రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
అందరూ ఊహించినట్టుగా చెపాక్‌లో స్పిన్నర్లు మాయ చేస్తారనుకుంటే అందుకు పూర్తి భిన్నంగా బంగ్లా పేసర్ హసన్ రోహిత్ సేనకు ఊహించని షాకిచ్చాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియాను ఆరంభ ఓవర్లలో అతడు ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి సెషన్లో అతడి గణాంకాలే (5 ఓవర్లు 2 మెయిడిన్లు 6 పరుగులు 3 వికెట్లు) ఇందుకు నిదర్శనం. వ్యక్తిగత స్కోరు 1 వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కెప్టెన్ రోహిత్.. హసన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంగ్లా సారథి శాంతోకు క్యాచ్ ఇవ్వడంతో భారత వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత అతడు వరుస ఓవర్లలో.. గిల్, కోహ్లీనీ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో భారత్ 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (118 బంతుల్లో 56, 9 ఫోర్లు), రిషభ్ పంత్ (52 బంతుల్లో 39, 6 ఫోర్లు)తో కలిసి భారత్‌ను ఆదుకునే యత్నం చేశాడు. నాలుగో వికెట్‌కు ఈ ఇద్దరూ 62 పరుగులు జోడించారు. టాపార్డర్ ఇబ్బందిపడ్డా ఈ ఇద్దరు మాత్రం సంయమనంతో ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. లంచ్ సమయానికి భారత స్కోరు 88/3గా ఉంది. లంచ్ తర్వాత కొద్దిసేపటికే హసన్.. పంత్‌ను ఔట్ చేసి భారత్‌ను మరోసారి ఒత్తిడిలోకి నెట్టాడు. అర్ధ సెంచరీ తర్వాత జైస్వాల్.. నహీద్ రాణా బౌలింగ్‌లో షద్మాన్కు క్యాచ్ ఇవ్వగా రాహుల్‌ను మెహిది హసన్ మిరాజ్ బోల్తా కొట్టించడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
అత్యంత కఠిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్, జడేజా ఆరంభంలో కొద్దిసేపు ఆచితూచి ఆడారు. చెన్నైలోనే పుట్టి పెరిగి చిదంబరం పిచ్ స్వభావంపై పూర్తి అవగాహన ఉన్న అశ్విన్, దశాబ్దికి పైగా ఇక్కడ ఐపీఎల్ ఆడుతున్న (సీఎస్కేకు) జడ్డూ క్రీజులో కుదురుకునేదాకా ఓపిక పట్టారు. జడ్డూ నెమ్మదిగా ఆడినా అశ్విన్ వన్డే తరహా ఆట ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. టాపార్డర్‌ను ఇబ్బందిపెట్టిన హసన్, నహీద్తో పాటు స్పిన్నర్లు షకిబ్, మిరాజ్, తైజుల్ను భారత స్పిన్ ద్వయం సమర్థవంతంగా ఎదుర్కొంది. టీ విరామానికి క్రీజులో కుదురుకున్న అశ్విన్.. ఆ తర్వాత వేగం పెంచాడు. షకిబ్ 53వ ఓవర్లో స్లాగ్ స్వీప్‌తో సిక్సర్ అయితే చూసి తీరాల్సిందే. 58 బంతుల్లో అశ్విన్ అర్థ సెంచరీ పూర్తవగా జడేజా 73 బంతుల్లో దానిని పూర్తిచేశాడు. ఆఖరి సెషన్లో ఈ ఇద్దరూ మరింత దూకుడు పెంచారు. మిరాజ్ 73వ ఓవర్లో కవర్స్ మీదుగా సిక్సర్ బాదిన అశ్విన్.. 90లలోకి చేరాడు. షకిబ్ 78వ ఓవర్లో మూడో బంతికి సింగిల్ తీసి టెస్టుల్లో ఆరో శతకాన్ని పూర్తిచేశాడు. ఒక దశలో 144/6గా ఉన్న భారత స్కోరు.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 339/6కు చేరిందంటే అది ఈ ఇద్దరి చలవే. అశ్విన్, జడ్డూ క్రీజులో ఉండటంతో రెండో రోజు భారత్ 400 ప్లస్ స్కోరుపై కన్నేసింది.
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 89 ఏండ్ల టెస్టు రికార్డును తిరుగరాశాడు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి 10 ఇన్నింగ్స్‌లో 750 పరుగులకు పైగా సాధించిన తొలి బ్యాటర్ జైస్వాల్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2023లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన జైస్వాల్ కొత్త రికార్డుల వేటలో దూసుకెళుతున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో అర్ధసెంచరీ ద్వారా 1935లో వెస్టిండీస్ బ్యాటర్ జార్జ్ హెడ్లీ(747 పరుగులు) నెలకొల్పిన రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు 9 ఇన్నింగ్స్‌లో 712 పరుగులతో ఉన్న ఈ యువ క్రికెటర్ అర్ధసెంచరీతో ఈ ఫీట్ అందుకున్నాడు.
భారత్, బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ ప్రసారం చేస్తున్న స్పోర్ట్స్-18లో పప్పులో కాలేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ అంటూ పేర్కొంటూ ప్రసారం చేసింది.
భారత్: 80 ఓవర్లలో 339/6 (అశ్విన్ 102 నాటౌట్, జడేజా 86 నాటౌట్, జైస్వాల్ 56, హసన్ మహ్ముద్ 4/58)