మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మూడో టైటిల్ వేటలో ఉన్న ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ర్యాంకర్ అరీనా సబలెంకా ఈ టోర్నీ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం రాడ్ లీవర్ ఎరీనాలో జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లో సబలెంకా.. 6-1, 7-6 (7/1)తో 19 ఏండ్ల కెనడా అమ్మాయి విక్టోరియా బొకొపై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. 31 నిమిషాల్లో ముగిసిన తొలి సెట్లో బొకొ నుంచి సబలెంకాకు ప్రతిఘటనేమీ ఎదురుకాకపోయినా రెండో సెట్లో మాత్రం శ్రమించాల్సి వచ్చింది.
ఇరువురూ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడటంతో సెట్ కాస్తా టైబ్రేకర్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లో సబెలంకాదే పైచేయి అయినా బొకొ పోరాటం ఆకట్టుకుంది. క్వార్టర్స్‌లో యూఎస్ అమ్మాయి, 18 ఏండ్ల ఇవా జొవిచ్తో తలపడనుంది. మరో పోరులో మూడో సీడ్ కోకో గాఫ్ (యూఎస్).. 6-1, 3-6, 6-3తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. క్వార్టర్స్‌లో గాఫ్.. 12వ సీడ్ ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినతో అమీతుమీ తేల్చుకోనుంది.
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) 7-6 (8/6), 6-4, 7-5తో టామీ పాల్ (యూఎస్)ను చిత్తుచేసి క్వార్టర్స్‌కు ప్రవేశించాడు. కానీ 11వ సీడ్ డానియల్ మెద్వెదెవ్కు షాక్ తగిలింది. ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్.. 4-6, 0-6, 3-6తో లర్నర్ టైన్ (యూఎస్) చేతిలో ఓటమిపాలయ్యాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), అలగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) తమ ప్రత్యర్థులను ఓడించారు. నేడు జరగాల్సిన ప్రిక్వార్టర్స్ నుంచి జాకుబ్ మెన్సిక్ (చెక్) గాయంతో తప్పుకోవడంతో నొవాక్ జొకోవిచ్ క్వార్టర్స్‌కు ముందంజ వేశాడు. క్వార్టర్స్‌లో అల్కరాజ్.. మినార్‌తో ఆడాల్సి ఉండగా జ్వెరెవ్, టైన్‌తో తలపడతాడు.