Aryna Sabalenka | న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ అమ్మాయి అరీనా సబలెంక గెలుచుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక.. 7-5, 7-5తో జెస్సిక పెగుల (యూఎస్ఏ)ను ఓడించింది.
రెండో సీడ్ సబలెంకకు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా యూఎస్ ఓపెన్‌ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. గతేడాది ఫైనల్లో అమెరికా అమ్మాయి కోకో గాఫ్ చేతిలో ఓడిన సబలెంక.. ఈసారి మాత్రం వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి విజేతగా నిలిచింది.
సుమారు రెండు గంటల పాటు జరిగిన టైటిల్ పోరులో ఈ బెలారస్ అమ్మాయి.. తొలి సెట్ నుంచే దూకుడుగా ఆడింది. మ్యాచ్‌లో 6 ఏస్‌లు, 40 విన్నర్లు కొట్టిన ఆమె.. తొలి సెట్లో ఆద్యంతం ఆధిక్యం కనబరిచింది. రెండో సెట్లో 0-3తో వెనుకబడ్డా తర్వాత పుంజుకుని సెట్‌తో పాటు టైటిల్‌నూ సొంతం చేసుకుంది. సబలెంక బలమైన సర్వీసులకు తొలిసారి ఫైనల్ ఆడుతున్న జెస్సికకు పరాభవం తప్పలేదు.
ఈ విజయంతో 2016 తర్వాత ఒకే ఏడాది హార్డ్ కోర్ట్‌లో రెండు టైటిల్స్ (ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్) గెలిచిన తొలి క్రీడాకారిణిగా సబలెంక నిలిచింది. 2016లో జర్మనీ ప్లేయర్ కెర్బర్ ఈ ఘనత సాధించింది.
3,600,000 యూఎస్ డాలర్లు
రూ. 30.23 కోట్లు
2019లో నా తండ్రిని కోల్పోయిన తర్వాత ఒకే ఒక్క లక్ష్యంతో టెన్నిస్ ఆడుతున్నా. టెన్నిస్ చరిత్రలో నా కుటుంబం పేరును చిరస్థాయిలో నిలిచిపోయేలా చేయాలనుకున్నా. ట్రోఫీపై నా పేరును చూసినప్పుడల్లా నా కుటుంబం చాలా గర్వపడుతోంది.
-సబలెంక