Duleep Trophy : టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) దులీప్ ట్రోఫీలో నిప్పులు చెరిగాడు. తన పేస్, స్వింగ్‌తో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ‘ఇండియా బీ’ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. అర్ష్‌దీప్ 9 వికెట్లతో చెలరేగడంతో ఇండియా డీ 257 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ఇండియా బీ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (40 నాటౌట్) చివరిదాకా పోరాడినా లాభం లేకపోయింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్ష్‌దీప్ సింగ్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా డీ తరఫున ఆడుతున్న ఈ యువ పేసర్ 9/90తో జట్టును గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ఆదిత్య థాక్రే(4/59) ధాటికి 373 పరుగుల ఛేదనలో ఇండియా బీ 115కే ఆలౌటయ్యింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్ష్‌దీప్ ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి.
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో తొలుత ఆడిన ఇండియా డీ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టింది. ఇండియా బీ బౌలర్లను ఉతికేసిన సంజూ శాంసన్() శతకంతో గర్జించగా.. రికూ భూయి(56) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(116) సెంచరీతో చెలరేగినా మిగతావాళ్లు చేతులెత్తేయడంతో ఇండియా బీ 282కే కుప్పకూలింది.
రెండో ఇన్నింగ్స్‌లో రికూ భూయి 119 నాటౌట్‌తో ఇండియా డీని పోటీలోకి తెచ్చాడు. అనంతరం భారీ ఛేదనలో అర్ష్‌దీప్ సింగ్, థాక్రేలు ఇండియా బీ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. ఈ ఇద్దరే పది వికెట్లు తీసి ఇండియా డీకి చిరస్మణీయ విజయాన్ని కట్టబెట్టారు. ఒత్తిడిలోనూ ఖతర్నాక్ సెంచరీతో ఇండియా డీని ఒడ్డున పడేసిన రికూ భూయి(119 నాటౌట్) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.