పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన షూటర్లు మరోసారి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. రెండో రోజే మను భాకర్ కంచు మోత మోగించడంతో ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో షూటర్‌కు అందినట్టే అందిన కాంస్యం కొద్దిపాటి తేడాతో చేజారింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మెడల్ రేసులో నిలిచిన యువ షూటర్ అర్జున్ బబుతా.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదే ఈవెంట్ మహిళల విభాగంలో షూటర్ రమితా జిందాల్ నిరాశపరిచింది. అయితే మను.. సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్య పోరుకు అర్హత సాధించి మరో పతకం మీద ఆశలు రేకిత్తిస్తోంది. మంగళవారం ఆ ద్వయం గెలిస్తే భారత ఒలింపిక్ చరిత్రలో ఏ క్రీడాకారుడికీ సొంతకాని రికార్డును దక్కించుకున్నట్టే! ఇక హాకీలో డ్రాతో గట్టెక్కిన భారత్‌కు ఆర్చర్లు మరోసారి నిరాశపరిచారు. బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్ ద్వయం క్వార్టర్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించగా లక్ష్యసేన్ అదరగొట్టాడు.
పారిస్: విశ్వక్రీడల్లో రెండోరోజే షూటింగ్లో మనూ బాకర్ కాంస్యంతో బోణీ కొట్టిన భారత్.. మూడో రోజు త్రుటి లో పతకం కోల్పోయింది. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ పతక పోరులో యువ భారత షూటర్ అర్జున్ మెడల్‌పై ఆశలు రేపినా అతడు నాలుగో స్థానంలో నిలవడంతో క్రీడాభిమానుల గుండె పగిలింది. క్వాలిఫికేషన్ రౌండ్లో 650.1 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన అర్జున్.. ఫైనల్ పోరులో 208.4 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చైనా షూటర్ షెంగ్ లిహావో (252.2) స్వర్ణాన్ని గెలుచుకోగా 251.4 పాయింట్లతో విక్టర్ లిండ్‌గ్రెన్ (స్వీడన్) రజతం నెగ్గాడు. క్రొయేషియాకు చెందిన మిరన్ మారికిక్ (230) కాంస్యం సొంతం చేసుకున్నాడు.
ఆ మూడు షాట్లు కుదిరుంటే..
పతక బరిలో 13వ షాట్ వరకూ బబుతా రజతం రేసులో దూసుకెళ్లాడు. 13వ షాట్‌కు 9.9 పాయింట్లే సాధించడంతో అతడు వెనుకబడ్డాడు. మళ్లీ 14వ షాట్‌తో 10.6 స్కోరుతో మెడల్ రేసులోకి వచ్చినా 15వ షాట్‌కు 10.2 పాయింట్లే వచ్చాయి. దీంతో అప్పటిదాకా విక్టర్‌తో 0.1 పాయింట్ల వ్యత్యాసం సిల్వర్ మెడల్ రేసులో నిలిచిన అతడు ఆ తర్వాత మూడో స్థానానికి పడిపోయాడు. 18వ షాట్‌కు 10.2 పాయింట్లు రాబట్టిన అర్జున్.. 20వ షాట్‌కు 10.5 పాయింట్లు సాధిస్తే విశ్వక్రీడల్లో మరోసారి మువ్వన్నెల పతాకం రెపరెపలాడేది. కానీ అర్జున్ 9.5 పాయింట్లే స్కోరు చేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమితా జిందాల్.. 145.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
క్వార్టర్స్‌కు సాత్విక్ – చిరాగ్ ద్వయం
భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో ఈ జోడీ.. సోమవారం జర్మనీ జంట మార్క్ లమ్స్‌ఫస్, మార్విన్ సిడెల్తో ఆడాల్సి ఉన్నా మార్క్‌కు మోకాలి గాయం కారణంగా అతడు టోర్నీ నుంచి వైదొలగడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఫ్రాన్స్ ద్వయం కొర్వి-లబర్.. ఇండోనేషియా షట్లర్లు రియాన్-ఫజర్ చేతిలో ఓడటంతో సాత్విక్-చిరాగ్ రెండో స్థానానికి దూసుకెళ్లి క్వార్టర్స్ బెర్తును దక్కించుకున్నారు. తద్వారా పురుషుల డబుల్స్‌లో క్వార్టర్స్ చేరిన తొలి భారతీయ జంటగా రికార్డులకెక్కింది. ఈ జోడీ మంగళవారం రియాన్-ఫజర్ను ఓడిస్తే గ్రూపులో అగ్రస్థానంతో ముగించే అవకాశం ఉంటుంది.
యువ భారత షట్లర్ లక్ష్యసేన్ ఒలింపిక్స్ అరంగేట్ర మ్యాచ్‌లో బోణీ కొట్టాడు. పురుషుల సింగిల్స్ గ్రూప్-ఎల్ లో భాగంగా సేన్ 21-19, 21-14తో జులియన్ కరెగ్గి (బెల్జియం)ను వరుస సెట్లలో ఓడించాడు. వాస్తవానికి ఈ ఒలింపిక్స్‌లో సేన్‌కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో అతడు గ్వాటమెల్లా ప్రత్యర్థి కెవిన్ కార్డన్‌ను ఓడించాడు. కానీ కార్డన్ ఎడమ చేతి గాయం కారణంగా ఈ క్రీడల నుంచి తప్పుకున్నాడు. దీంతో నిర్వాహకులు ఆ విజయాన్ని ‘డిలీట్’ చేయడంతో సేన్‌కు ఇదే మొదటి మ్యాచ్ అయింది. ఇక మహిళల డబుల్స్‌లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో 11-21, 12-21తో నమి మట్సుయమ-చిహారు షిదా (జపాన్) చేతిలో ఓడారు. భారత జోడీకి ఇది వరుసగా రెండో పరాభవం. మరో మ్యాచ్ ఓడితే ఈ జంట ఇంటి బాట పట్టడం ఖాయం!
నోటి దురుసుకు తప్పదు భారీ మూల్యం
పారిస్: మహిళా స్విమ్మర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వెటరన్ కామెంటేటర్ బాబ్ బొలార్డ్ను యూరో స్పోర్ట్స్ కామెంటరీ బాధ్యతల నుంచి తప్పించింది. ఆస్ట్రేలియా మహిళల 4X100 మీటర్ల ఫ్రీస్టయిల్ జట్టు స్వర్ణం గెలిచిన తర్వాత కామెంటరీ బాక్స్‌లో బొలార్డ్.. ‘మహిళలు ఎలా ఉంటారో మీకు తెలుసా? చుట్టూ తిరుగుతూ ఒకరి మేకప్ గురించి మరొకరు చర్చించుకుంటారు’ అని వ్యాఖ్యానించాడు. దీనిపై విమర్శలు రావడంతో యూరోస్పోర్ట్స్ తక్షణమే అతడిని కామెంటరీ బాధ్యతల నుంచి తొలగించింది.
డ్రాతో గట్టెక్కిన హాకీ జట్టు
హాకీలో అర్జెంటీనాతో జరిగిన పూల్-బీ రెండో మ్యాచ్‌లో భారత జట్టు డ్రా (1-1)తో గట్టెక్కింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చివరి నిమిషం (59వ)లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఉండకపోతే ‘మెన్ ఇన్ బ్లూ’కు ఓటమి తప్పకపోయేది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా తరఫున లుకాస్ మార్టినెజ్ 22వ నిమిషంలోనే తొలి గోల్ కొట్టి ఆ జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. ఆ తర్వాత అర్జెంటీనా డిఫెండర్లు భారత గోల్ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నారు. భారత్ కూడా సుమారు 9 పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చిన సువర్ణావకాశాలను జారవిడుచుకుని పీకలమీదకు తెచ్చుకుంది. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా హర్మన్‌ప్రీత్ అర్జెంటీనా రక్షణ శ్రేణిని తప్పిస్తూ చేసిన గోల్‌తో భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మంగళవారం ఐర్లాండ్‌తో మూడో మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.
ఆర్చర్లది అదే కథ
ఆర్చరీ టీమ్ ఈవెంట్స్‌లో క్వార్టర్స్ చేరిన భారత మహిళల జట్టు మాదిరిగానే పురుషులకూ ఓటమి తప్పలేదు. క్వార్టర్స్‌లో భారత్.. 2-6తో టర్కీ చేతిలో ఓడింది.