వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరడం మొత్తంగా ఏడోసారి. ఇది వరకు మూడు సార్లు ట్రోఫీ నెగ్గి మరో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. మెస్సీ కెప్టెన్సీలో ఆ జట్టు ఫైనల్ చేరడం ఇది మూడోసారి.
అట్లాంటా: సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ వరుసగా రెండో ప్రపంచకప్ అందుకొని ఈ ఆటలో తనకు తానే సాటి అని చాటిచెప్పేందుకు మరొక్క అడుగు దూరంలో నిలిచాడు. అమెరికా గడ్డపై అత్యంత హోరాహోరీగా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బలమైన ఇంగ్లండ్ పని పట్టి మరోసారి సాకర్ సామ్రాజ్యాన్ని జయించేందుకు ఒకే ఒక్క విజయం దూరంలో నిలిచింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో మెస్సీసేన 2-1 గోల్స్ తేడాతో ‘త్రీ లయన్స్’ను ఓడించింది. మ్యాచ్ మెజారిటీ భాగం ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరి క్షణాల్లో అర్జెంటీనా మరోసారి మ్యాజిక్ చేసింది. 55వ నిమిషంలో ఇంగ్లిష్ టీమ్ ఆటగాడు ఆంధోనీ గోర్డాన్ ఆ జట్టుకు గోల్ అందించగా.. ఏడు నిమిషాల వ్యవధిలోనే ఎంజో ఫెర్నాండెజ్ (85వ ని), లొటారో మార్టినెజ్ (91వ ని) చెరో గోల్ కొట్టి అర్జెంటీనాను ఫైనల్‌కు చేర్చారు. ఈ రెండు గోల్స్‌కు సహకరించిన 39 ఏండ్ల మెస్సీ.. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపెను వెనక్కునెట్టి గోల్డెన్ బూట్ అవార్డు రేసులో టాప్‌లోకి వచ్చాడు. ఈ పరాజయంతో 1966 తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ చేరాలనే ఇంగ్లండ్ కల మరోసారి భగ్నమైంది. ఆదివారం జరిగే తుదిపోరులో స్పెయిన్‌తో మెస్సీసేన తలపడనుంది.
ఫుట్‌బాల్‌లో ఘన చరిత్ర కలిగిన అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య సెమీస్ పోరు అంచనాలను మించి సాగింది. తీవ్ర ఉత్కంఠ.. భావోద్వేగాల మధ్య ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి పోరాడిన ఆటలో చివరకు హ్యారీకేన్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్‌పై అర్జెంటీనాదే పైచేయి అయింది. ఆట ప్రారంభం నుంచే ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ, తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా రాలేదు. దూకుడుగా ఆడిన మెస్సీసేన.. ప్రత్యర్థి రక్షణశ్రేణిలోకి చొచ్చుకొచ్చి పలుమార్లు దాడులు చేసినా బంతిని నెట్లోకి పంపలేకపోయింది. అయితే, విరామం నుంచి వచ్చిన వెంటనే కేన్ సేన ఖాతా తెరిచింది. రోజర్స్ అందించిన అద్భుతమైన క్రాస్‌ను ఆంథోనీ గోర్డాన్ పర్ఫెక్ట్ షాట్‌తో గోల్‌గా మలిచాడు. దాంతో ఇంగ్లిష్ టీమ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లగా మెస్సీసేన షాకైంది. ఆ తర్వాత హ్యారీకేన్ సేన పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమై అర్జెంటీనా దాడులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇక మ్యాచ్ ఇంగ్లండ్ వశమవుతుందనుకున్న తరుణంలో మెస్సీ తన అసాధారణ ప్రతిభతో ఆట స్వరూపాన్ని మార్చేశాడు. 85వ నిమిషంలో మెస్సీ ఇచ్చిన పాస్‌ను ఫెర్నాండెజ్ బాక్స్ వెలుపల 20 మీటర్ల దూరం నుంచి మెరుపు షాట్ కొట్టి ప్రత్యర్థి కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్‌ను దాటిస్తూ నెట్లోకి పంపాడు. స్కోరు 1-1తో సమం అవగా అర్జెంటీనా జట్టులో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ఇక మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు దారితీస్తుందనుకున్న సమయంలో ఇంజూరీ టైమ్ మొదలైన రెండో నిమిషంలోనే ఆ జట్టు మరో సంచలనం సృష్టించింది. మాక్ అలిస్టర్ కొట్టిన షాట్ పోస్ట్‌కు తగిలి వెనక్కి రాగా, దాన్ని అందుకున్న మెస్సీ కుడి వైపు నుంచి ఇంగ్లండ్ డిఫెండర్లను ఏమారుస్తూ పిన్‌పాయింట్ క్రాస్ ఇచ్చాడు. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన మార్టినెజ్.. మెస్సీ క్రాస్‌ను అంతే అద్భుతంగా హెడర్ ద్వారా గోల్‌గా మలిచి అర్జెంటీనాను 2-1తో ముందంజలో నిలిపాడు. మరో పది నిమిషాల ఆటలో స్కోరు సమం చేయలేకపోయిన ఇంగ్లండ్ నిరాశగా వెనుదిరిగింది.
ఇంగ్లండ్‌పై విజయం సాధించిన అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లు ‘లాస్ మాల్వినాస్ సన్ అర్జెంటీనాస్’ (ఫాక్లాండ్ దీవులు అర్జెంటీనావే) అని రాసి ఉన్న బ్యానర్‌ను మైదానంలో ప్రదర్శించడం తీవ్ర వివాదానికి దారితీసింది. బ్రిటన్‌కు చెందిన వివాదాస్పద ఫాక్లాండ్ దీవులపై అర్జెంటీనాకే సార్వభౌమాధికారం ఉందనే అర్థం వచ్చేలా ఉన్న ఆ బ్యానర్ ప్రదర్శనపై సమగ్ర విచారణ జరపాలని బ్రిటన్ ప్రభుత్వం ఫిఫాను డిమాండ్ చేసింది. 1982లో అర్జెంటీనా సైన్యం ఈ దీవులపై దాడి చేయగా, బ్రిటన్ 10 వారాల యుద్ధం తర్వాత వీటిని తిరిగి చేజిక్కించుకుంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన వందలాది మంది సైనికులు మరణించారు. అయితే, రాజకీయాలకు తావుండకూడదని, అర్జెంటీనా ఆటగాళ్ల తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బ్రిటన్ వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్ పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ సందేశాల ప్రదర్శనపై ఫిఫా గతంలో కఠిన చర్యలు తీసుకుంది. 2014 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లోనూ అర్జెంటీనా ఇదే బ్యానర్ ప్రదర్శించడంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంపై ఫిఫా జరిమానా విధించింది. ఈసారి ఫైనల్ ముంగిట ఆ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది.