న్యూఢిల్లీ: అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. సోమవారం ముంబై నుంచి ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్న ఈ సాకర్ దిగ్గజం లీలా ప్యాలెస్ హోటల్లో ఎంపిక చేసిన కొద్ది మంది అతిథులతో గడిపాడు. ఆ తర్వాత అక్కణ్నుంచి అరుణ్‌జైట్లీ స్టేడియం చేరుకున్న మెస్సీతో పాటు సహచర ప్లేయర్లు లూయిస్ సువారెజ్, రోడ్రిగో ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు.
తన భారత పర్యటనపై మెస్సీ మాట్లాడుతూ ‘ ఈ మూడు రోజుల్లో మీరు నాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. స్వల్ప వ్యవధిలోనే మీ అందరి ప్రేమాభిమానాన్ని చూరగొనడం మరిచిపోలేనిది. మీరు మా పట్ల కనబరిచిన ప్రేమ, అప్యాయతను ఇక్కణ్నుంచి తీసుకెళుతున్నాం.
ఏదో ఒక రోజు భారత్‌లో మ్యాచ్ ఆడేందుకు వస్తాం. అందరికీ కృతజ్ఞతలు’ అని అన్నాడు. మెస్సీ, సువారెజ్, రోడ్రిగోకు ఐసీసీ చైర్మన్ జైషా.. టీమ్ఇండియా జెర్సీలు అందజేశారు. అందుకు తోడు టీమ్ఇండియా క్రికెటర్ల సంతకాలతో కూడిన బ్యాటును జ్ఞాపికగా బహుకరించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించి మ్యాచ్ టికెట్‌ను మెస్సీకి ఇచ్చారు.