షాంఘై: ప్రపంచ ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత ఆర్చర్లు పతకాల వేటలో మరో ముందడుగు వేశారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఇద్దరు ఆర్చర్లు సెమీస్ చేరగా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పోరుకు అర్హత సాధించింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో పార్థ్ సలుంఖె.. 6-2తో కిమ్ జి డిఒక్ (దక్షిణ కొరియా)ను చిత్తుచేసి సెమీస్‌కు చేరాడు.
తొలి రౌండ్లో పార్థ్.. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్‌లో కాంస్యం గెలిచిన మెటె గజోజ్ (టర్కీ)ను షూటాఫ్‌లో ఓడించి సంచలనం సృష్టించాడు. ఇదే విభాగంలోని మహిళల క్వార్టర్స్‌లో దీపికా కుమారి.. 6-2తో లి జియామెన్ (చైనా)ను ఓడించింది. మరో క్వార్టర్స్‌లో అతాను దాస్, అంకిత భక్త్ ఓటమిపాలయ్యారు.