Asia Cup | ఆసియా కప్‌లో భారత్‌ను చిత్తుచేస్తామని పాకిస్తాన్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ పేర్కొన్నాడు. సెప్టెంబర్ నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగనున్నది. సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనున్నది. టోర్నీ కోసం పాక్ జట్టును పీసీబీ ప్రకటించింది. భారత జట్టును మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సెలెక్టర్ ఆకిజ్ జావేద్ మాట్లాడుతూ పాకిస్తాన్ టీ20 జట్టు భారత్‌ను ఓడించే సత్తా ఉందని పేర్కొన్నాడు. ఇరుదేశాల మధ్య మ్యాచ్‌లో ఎంతో కీలకమైనవని.. 17 మంది సభ్యుల జట్టు ఏ టీమ్‌నైనా ఓడిస్తుందని.. అయితే వారిపై ఒత్తిడి పెంచకూడదని చెప్పుకొచ్చాడు. ఈ జట్టుపై తనకు చాలా అంచనాలున్నాయని తెలిపాడు.
టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో పాకిస్తాన్‌పై భారత్‌కు మంచి రికార్డు ఉన్నది. రెండుజట్ల మధ్య 13 మ్యాచులు జరగ్గా.. ఇందులో భారత్ పది మ్యాచుల్లో విజయం సాధించింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 120 లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నది. గత ఎడిషన్ 2023లో శ్రీలంకను తక్కువ స్కోరుతో ఫైనల్లో ఓడించి టైటిల్‌ను గెలిచింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆదివారం ట్రై-సిరీస్‌తో పాటు ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా సల్మాన్ అగాకు అప్పగించగా.. సీనియర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌లకు జట్టులో స్థానం దక్కలేదు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బాబర్ ప్రదర్శన చెప్పుకోదగ్గ లేదు. మూడు మ్యాచుల్లో కలిసి 56 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 47 పరుగులు మాత్రమే. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన ఫఖర్ జమాన్ జట్టులో చోటు సంపాదించాడు. అదే సమయంలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన సైమ్ అయూబ్, ఆల్ రౌండర్ హసన్ నవాజ్ కూడా జట్టులో చోటు దక్కించుకోగలిగారు. అయితే, వెస్టిండీస్ పర్యటనలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ నసీమ్ షాకు మాత్రం నిరాశే ఎదురైంది.
బాబర్, రిజ్వాన్‌లను జట్టులో చోటు కల్పించకపోవడంపై ఆకిబ్ జావేద్ స్పందిస్తూ.. తాము ఇద్దరిని పూర్తిగా పక్కన పెట్టలేదని చెప్పాడు. ఆటగాడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడో దాన్ని ఈ ఆప్షన్స్ ప్రతిబింబిస్తున్నాయన్నాడు. ఇందుకు సాహిబ్జాదే ఫర్హాన్, సామ్, ఫఖర్లను ఉదాహరణగా చూపించారు. సాహిబ్జాదే తిరిగి జట్టులోకి వచ్చాడని.. సామ్ మొదట్లో ఇబ్బంది పడ్డాడని.. ఆ తరువాత అతను ప్రభావం చూపించాడని.. ఏ ఆటగాడి కెరీర్‌పైనా ఎలాంటి ముద్ర వేయలేరన్నాడు. అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయని.. ప్రస్తుతం వారు బిగ్ బాష్, పీఎస్ఎల్ వంటి లీగ్‌లలో అనుభవాన్ని సంపాదిస్తున్నారని.. బాగా రాణిస్తున్న వ్యక్తి ఆడతాడని.. బాగా రాణిస్తున్న వ్యక్తి మాత్రమే ఆడటానికి అర్హుడని చెప్పుకొచ్చాడు
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా, సలీబ్జాదా, ఎం ఆఫ్రిది, సుఫియాన్ మోకిమ్.