Pairs Olympics 2024 : ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) అనర్హతకు గురవ్వగా.. యువకెరటం అంతిమ్ పంగల్ (Antim Panghal) తీవ్రంగా నిరాశపరిచింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న అంతిమ్ అనూహ్యంగా ప్రీ-క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది.
బుధవారం జరిగిన 53 కిలోల విభాగం మ్యాచ్‌లో టర్కీ రెజ్లర్ జెయ్నెప్ యెట్గిల్(Zeynep Yetgil) చేతిలో కంగుతిన్నది. సాంకేతికంగా అత్యధిక పాయింట్లు సాధించిన జెయ్నెప్ 10-0తో అంతిమ్‌పై విజయం సాధించింది.
దాంతో, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన అంతిమ్ ఒలింపిక్స్ మెడల్ కల చెదిరింది. తద్వారా పారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగిన మూడో భారత రెజ్లర్ అయింది. 68 కిలోల విభాగంలో నిషా దహియా(Nisha Dahiya) గాయం కారణంగా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.