వాషింగ్టన్: ఇరాన్‌తో లింకులు ఉన్న పాకిస్థానీ జాతీయుడి(Pakistan Man)ని .. అమెరికా అరెస్టు చేసింది. అమెరికా రాజకీయవేత్తలను హత్య చేసేందుకు ఆ పాక్ వ్యక్తి ప్లాన్ వేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ కోర్టు పేర్కొన్నది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు అతను ప్లాన్ వేసినట్లు అనుమానిస్తున్నారు. పాక్‌కు చెందిన అసిఫ్ రాజా మెర్చంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై అభియోగాలు నమోదు అయినట్లు అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ తెలిపారు. జనరల్ ఖాసిమ్ సోలేమాని హత్య తర్వాత అమెరికా ప్రభుత్వాధికారులపై ఇరాన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోందన్నారు . పాకిస్థాన్ జాతీయుడైన అసిఫ్ రాజా.. కిరాయి హత్యలకు పాల్పడేందుకు సిద్దమైనట్లు ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు.
అసిఫ్ రాజాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు పాకిస్థాన్‌లో, మరొకరు ఇరాన్లో ఉన్నారు. రెండు దేశాల్లోనూ అతనికి పిల్లలు కూడా ఉన్నారు. అసిఫ్ వేసిన ప్రణాళికలు స్పై థ్రిల్లర్‌ను తలపిస్తున్నట్లు కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. డాక్యుమెంట్లను దొంగలించడం, యూఎస్బీ డ్రైవర్లను చోరీ చేయడం, నిరసనలు చేపట్టడం, ప్రభుత్వ అధికారులను చంపడం లాంటి ప్లాన్ వేశారు. అన్ని ప్రణాళికలకు కోడ్లు ఉన్నట్లు కోర్టు తెలిపింది. ఇటీవల పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నానికి అసిఫ్‌తో లింకు లేదు. కానీ ఆ తరహా అటాక్లక ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అండర్‌కవర్ ఎఫ్‌బీఐ ఏజెంట్ల ద్వారా హత్యలకు ప్లాన్ వేసినట్లు న్యూయార్క్ ఎఫ్‌బీఐ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ క్రిస్టీ కర్టిస్ తెలిపారు.