ఢాకా, ఆగస్టు 6: రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్‌లో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలపై ఆందోళనకారులు దాడులకు తెగబడుతున్నారు. వారి ఇండ్లు, వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారు. జోహోర్ జిల్లాలో అవామీ లీగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షహిన్ ఛక్లదర్‌కు చెందిన జబీర్ ఇంటర్నేషన్ హోటల్‌కు సోమవారం రాత్రి అల్లరిమూక నిప్పు అంటించింది. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇండోనేషియాకు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు. పలువురు హోటల్ సిబ్బంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. హోటల్ శిథిలాల్లో మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉందని సిబ్బంది చెప్తున్నారు.
440కు చేరిన మృతుల సంఖ్య
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారగా, ఇప్పటివరకు 440 మంది మరణించారు. ఆదివారం, సోమవారం చెలరేగిన హింసతో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 250 మందికి పైగా మరణించినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. సోమవారం హసీనా రాజీనామా తర్వాత అల్లర్లు మరోరూపం దాల్చాయి. అప్పటివరకు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య గొడవలు జరగగా.. హసీనా రాజీనామా తర్వాత ఆందోళనకారులు అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకున్నారు.